
భవనాల తరలింపు ఓ కుట్ర
సీఎం బినామీలు వేల ఎకరాలను ఆక్రమించారు
ఈ భవనాల తరలింపులో ఆ డాక్యుమెంట్లు మిస్ అయ్యాయని చెబుతారు
భవనాల తరలింపు పేరుతో ఫైళ్లు మాయం చేస్తారు
సీఎం కేసీఆర్ బినామీలను కాపాడేందుకే ఈ తరలింపు
ఈ ఫైళ్ల భద్రత బాధ్యత గవర్నర్ దే – రేవంత్ రెడ్డి
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు ఇవాళ గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ ఎదుట రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సచివాలయం కూల్చివేత, శాసన సభ తరలింపుపై అభ్యంతరం చెబుతూ గవర్నర్ ను కలగజేసుకోవాలని కోరామన్నారు. జనంపై ఆర్థిక భారం మోపే ఈ కట్టడాల కూల్చివేత, పునర్నిర్మాణం అవసరం లేని చర్యలని అన్నారు. వ్యక్తిగత మూఢ నమ్మకాల కోసం సీఎం కేసీఆర్ ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు.
వచ్చేవారం సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం
హైకోర్టులో పిటిషన్లు విచారణలో ఉన్నప్పటికీ శాఖల తరలింపు, భవనాల తరలింపు జరుగుతోందని .. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏ ఆఫీస్ లో ఉన్న రికార్డులను ఎలా కాపాడాలి అనేది చాలా ముఖ్యమైన విషయం అని గుర్తుచేశారు. ఈ ఫైళ్ల భద్రత బాధ్యత కూడా గవర్నర్ దే అని చెప్పారు రేవంత్ రెడ్డి. వచ్చేవారంలో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నామని చెప్పారు.
“సీఎం బినామీపై ఇటీవలే ఐటీ దాడులు జరిగాయి. కొన్ని వేల ఎకరాలను వాళ్లు ఆక్రమించుకున్నారు. ఈ సచివాలయ తరలింపులో ఆ భూముల డాక్యుమెంట్లు మిస్సయ్యాయని చెప్పేందుకే ఇలా చేస్తున్నారు. కోర్టులో వాదోపవాదాలు జరుగుతుండగానే మొత్తం తరలింపు చేస్తున్నారు.. 1956 ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్ని జీవోలు, మెమోలు, ఫైళ్లు ఇక్కడే ఉన్నాయి. ఇవాళ సీఎం ఒక్కో శాఖను.. ఒక్కో బిల్డింగ్ ను తరలిస్తూ.. మొత్తం రికార్డులను మాయం చేసే పరిస్థితి వచ్చింది. రికార్డులు మాయం అయితే బాధ్యత ఎవరిది. ఇది కేసీఆర్ కుట్ర. ఈ విధ్వంసాలను ఆపేందుకు కాంగ్రెస్ ప్రయత్నం, పోరాటం చేస్తుంది. గవర్నర్ కూడా వీటిని రక్షించాలి. సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తే… గవర్నర్ కూడా హాజరుకావాల్సి ఉంటుంది” అన్నారు రేవంత్ రెడ్డి.