కేసీఆర్ బక్కోడు కాదు.. భూ బకాసురుడు : రేవంత్ రెడ్డి

కేసీఆర్ బక్కోడు కాదు.. భూ బకాసురుడు : రేవంత్ రెడ్డి

దుబ్బాక నియోజకవర్గానికి రావాల్సిన నిధులను సీఎం కేసీఆర్ సిద్దిపేటకు తరలించుకుని పోతుంటే అనాడు చెరుకు ముత్యం రెడ్డి ప్రభుత్వంతో కొట్లాడి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చారని చెప్పారు రేవంత్ రెడ్డి. దుబ్బాకకు సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మామ (కేసీఆర్ ) మాదిరిగానే అల్లుడు (మంత్రి హరీష్ రావు ) కూడా నిధులు రాకుండా అడ్డుపడి సిద్దిపేటకు తరలించుకుని పోయాడని చెప్పారు. దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.   

ఉప ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చాడా..? ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏమైనా కృషి చేశాడా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాంత సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి.. ప్రభుత్వ మెడలు వంచాడా..? అని ప్రశ్నించారు. అనాడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎమ్మెల్యే రఘనందన్ రావుకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. వాళ్ల పార్టీ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడే తప్ప.. ఏనాడు దుబ్బాక అభివృద్ధి కోసం రఘునందన్ రావు ఏ ప్రయత్నం చేయలేదన్నారు.

మరోవైపు.. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. పేరులోనే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉంది కానీ.. ఆయన పాత చింతకాయ పచ్చడే .. కొత్త ప్రభాకర్ రెడ్డిని మెదక్ ఎంపీగా రెండుసార్లు గెలిపించినా దుబ్బాకకు ఎందుకు నిధులు తీసుకురాలేదు.. దుబ్బాకను ఎందుకు రెవెన్యూ డివిజన్ గా చేయించలేదు.. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు ఇప్పించలేదు.. డిగ్రీ కాలేజీ ఎందుకు తీసుకురాలేదు అని ప్రశ్నించారు. పదేళ్ల నుంచి ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ఫామ్ హౌజ్ దగ్గర పెద్ద జీతగాడిలా వారి పక్కన  బంట్రోతులా ఉన్నాడు..  దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం ఏమైనా ప్రయత్నం చేశాడా..? అని ప్రశ్నించారు. 

కేసీఆర్ కుటుంబ సభ్యులకే బంగారు తెలంగాణ అయ్యింది.. పేదలందరూ దివాళ తీసే పరిస్థితి వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం వస్తే కేసీఆర్ కు ఏం నొప్పి అని ప్రశ్నించారు. లక్ష కోట్లు మింగావు.. హైదరాబాద్ చుట్టుపక్కల పది వేల ఎకరాలను కబ్జా చేశావు.. నీవు బక్కోడివి కాదు.. మింగడానికి నీవు బకాసురుడివి.. ఫామ్ హౌజ్ లో ఉంటే నీవు కుంభకర్ణుడివి.. అంటూ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ లేస్తే మింగుతాడు. మింగుతే పంటాడు తప్ప.. ఏనాడు ప్రజా సమస్యలను పట్టించుకోడు.. దుబ్బాకకు పట్టిన శని ఏదైనా ఉందంటే అది కేసీఆర్ కుటుంబమే అని అన్నారు.  దుబ్బాకకు వచ్చే అభివృద్ధి పనులు, నిధులను సిద్దిపేట నియోజకవర్గానికి తరలించుకుపోతున్నారని చెప్పారు. పదేళ్లు అయినా దుబ్బాకను బంగారు తునకలా ఎందుకు చేయలేదు.. బొందలగడ్డ దుబ్బాకలా ఎందుకు మార్చారు అని ప్రశ్నించారు. 

అందరికీ ఆదర్శ కుటుంబంగా చెరుకు ముత్యం రెడ్డి కుటుంబం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

Also Read :-  గచ్చిబౌలిలో రూ.5 కోట్లు.. అన్నీ 500 నోట్లు పట్టివేత