న్యాయం కోసం ధర్నా చేస్తే అరెస్టులు చేస్తరా..?

న్యాయం కోసం ధర్నా చేస్తే అరెస్టులు చేస్తరా..?

బొల్లారం : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సామాన్యులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం బొల్లారం పోలీస్ స్టేషన్ నుండి విడుదలైన అనంతరం రేవంత్ రెడ్డి  మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసనలు చేస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసిన దుర్మార్గులపై చర్యలు తీసుకోని కేసీఆర్ సర్కార్.. న్యాయం కోసం ధర్నాలు చేస్తే మాత్రం ఎక్కడికక్కడ అరెస్టులు చేయిస్తారని చెప్పారు. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అన్నారు. రోడ్ల మీద అమ్మాయిలు స్వేచ్ఛగా నడవలేని దుర్మార్గమైన పరిస్థితులు కనిపిస్తున్నా ముఖ్యమంత్రి నోరు విప్పరని తెలిపారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని.. గ్యాసు, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెరుగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలుపుతుందన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని మోడీ వదలలేదంటే ఎంత దుర్మార్గమో చెప్పాలన్నారు.  రోడ్డు మీద ఉండాల్సిన పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల ముందు ఉండటం దారుణమన్నారు. ప్రశాంతంగా ఈడీ ఆఫీసు ముందు నిరసన తెలిపామని, ఎక్కడా కూడా ఇబ్బందులు జరగలేదన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించలేదని, కాంగ్రెస్ పార్టీ శాంతి కోరుకుంటుందని చెప్పారు. 

శాంతియుతంగా జరుగుతున్న నిరసనలో కాంగ్రెస్ కార్యకర్తలపై  పోలీసులు దాడులు చేశారన్న రేవంత్.. తోపులాటలో రేణుకా చౌదరి పడిపోతుండగా పోలీసును పట్టుకోవడంతో ఆమె మీద అన్యాయంగా నింద మోపారని చెప్పారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నా అన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని.. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా అని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులను కొట్టింది కాక.. అన్యాయంగా అక్రమ కేసులు పెట్టించిన కేసీఆర్ కు త్వరలోనే మా పవర్ చూపిస్తామని చెప్పారు. రేపు కేంద్రానికి సంబంధించిన ఆఫీసుల ముందు పీఎం మోడీ దిస్టి బొమ్మలను దగ్గం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. 11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, సామాన్యులపై అక్రమంగా పెట్టిన కేసులకు ఒక్క కలంతో ఎత్తిపారేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.