రాష్ట్రంలో కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్(KST) అమలవుతుంది: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్(KST) అమలవుతుంది: రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రజలకు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖరాశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్(KST) అమలవుతుందని లేఖలో పేర్కొన్నారు. ఏం చేయాలన్నా ఆరు శాతం కమీషన్ ముట్టజెప్పాల్సిందేనని తెలిపారు.

మద్యం ధరల పెంపు వెనుక KST మాఫియా ఉందన్న రేవంత్ రెడ్డి..మద్యం ధరల వ్యవహారంలో ఓ ఎంపీ చెన్నై, ఢిల్లీలో మకాం వేసి బేరం కుదిర్చారని ఆరోపించారు. ఈ భారీ కుంభకోణం కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ… ఎక్సైజ్ అండ్ ప్రమోషన్ శాఖగా మారిపోయిందన్నారు. మద్యాన్ని ప్రోత్సహించడమంటే మహిళల భద్రతలో రాజీ పడటమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

20 కోట్లకు పైగా జనాభా ఉన్న యూపీలో కూడా మద్యం ఆదాయం ఇంత లేదని, సీఎం కేసీఆర్ కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరుకాబట్టే KST కూడా ఆరు శాతమేనన్నారు. మద్యం అమ్మకాల్లో దోపిడీ కోసమే ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. కమీషన్లు ఇచ్చే బ్రాండ్లనే ప్రోత్సహిస్తున్నారన్న ఎంపీ..ఉత్పత్తి వ్యయం కంటే వెయ్యి శాతం అధిక ధరలా!?అని ప్రశ్నించారు. ఇంత అధిక ధరలకు అమ్ముతుంటే వినియోగదారుల ఫోరం ఏం చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.

లాటరీ జూదం అన్నారు…ఇప్పుడు అదే లాటరీ విధానంలో షాపులెలా కేటాయిస్తారని విమర్శించారు. షాపు దక్కని దరఖాస్తు దారుడుకి డబ్బు వాపస్ ఇవ్వకపోవడం నేరమన్నారు. జనవరి 30న కట్టాల్సిన రుసుములు ఈ రోజే కట్టాలని షాపులకు తాఖీదులు పంపడం దారుణమన్నారు. పెంచిన ధరలు తక్షణం నిలిపేయాలని లేఖలో డిమాండ్ చేశారు