వివేక్​పై ఐటీ దాడి కాంగ్రెస్​పై దాడే.. ఆయనకు అండగా ఉంటం : రేవంత్

వివేక్​పై ఐటీ దాడి కాంగ్రెస్​పై దాడే.. ఆయనకు అండగా ఉంటం : రేవంత్
  •     వివేక్ దశాబ్దాలుగా నిజాయతీగా వ్యాపారాలు చేస్తున్నరు 
  •     మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు.. ఇప్పుడు కనిపిస్తున్నాయా? 
  •     బీజేపీ, బీఆర్ఎస్​లో చేరినోళ్లు పవిత్రులు.. ప్రశ్నించేటోళ్లు ద్రోహులా? 
  •     ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం.. కాంగ్రెస్ నేతలపై దాడులకు అమిత్ షా, కేసీఆర్ కుట్ర
  •     ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో పీసీసీ చీఫ్ 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ​నేతలే టార్గెట్​గా ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారని పీసీసీ చీఫ్​రేవంత్ ​రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ ​వెంకటస్వామి ఇండ్లు, ఆఫీసులపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘‘వివేక్​ మీద జరిగిన దాడి.. కాంగ్రెస్ ​కుటుంబం మీద జరిగిన దాడిగా భావిస్తాం. ఆయనకు కాంగ్రెస్  అండగా ఉంటుంది” అని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ నేతలపై వరుసగా జరుగుతున్న  ఐటీ, ఈడీ దాడులపై ప్రజలకు రేవంత్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. 

‘‘వివేక్ కుటుంబం దశాబ్దాలుగా నిజాయితీతో వ్యాపారాలు చేస్తూ వందల కోట్ల పన్నులు కడుతున్నది. వివేక్ ​ఇండ్లు, ఆఫీసుల మీద ఎన్నికల సమయంలోనే దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు.. కాంగ్రెస్​లో చేరగానే కనిపించాయా?” అని లేఖలో ప్రశ్నించారు. ‘‘వివేక్ ​కుటుంబం తెలంగాణ సమాజం అభ్యున్నతికి పని చేసింది. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కాకా వెంకటస్వామి శ్రమించారు. 

అలాంటి కుటుంబంపై నేడు జరిగిన దాడులను ప్రజలు గమనించాలి. వివేక్​ను ప్రచారానికి వెళ్లనివ్వకుండా ఉదయం 6 నుంచి రాత్రి వరకు బందీగా ఉంచడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అర్థం చేసుకోవాలి” అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొన్నారు. 

దర్యాప్తు సంస్థలను పావులుగా మార్చిన్రు.. 

కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్.. అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నింటినీ రాజకీయ క్రీడలో పావులుగా మార్చారని రేవంత్ మండిపడ్డారు. ‘‘ఆ రెండు పార్టీల్లో చేరినోళ్లు పవిత్రులు, ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులు అన్నట్టుగా చిత్రీకరిస్తూ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు. 

దేశం, రాష్ట్రంలో ప్రతిపక్షమే అన్నది లేకుండా చేసేందుకు, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులు మిగలకుండా చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్​ల మధ్య కుదిరిన ఒప్పందమే కామన్ ​మినిమమ్ ​ప్రోగ్రామ్. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని సైతం వీళ్లు తమ కుట్రలు, కక్షలతో వేధిస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. 

కాంగ్రెస్ గెలుస్తుందనే దాడులకు కుట్ర..  

నెల రోజుల నుంచి కేవలం కాంగ్రెస్ ​నాయకులే టార్గెట్​గా ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని రేవంత్ ఫైర్ అయ్యారు. ఆ దాడుల వెనుకున్న అదృశ్య హస్తాలు ఎవరివని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ ​నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడి నుంచి అందుతున్నాయి? గత పదేండ్లలో మోదీ, అమిత్​ షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమ చిటుక్కుమన్నది లేదు. 

దీన్ని బట్టి కాంగ్రెస్ నేతల ఇండ్లపై జరుగుతున్న దాడుల వెనుక ఎవరున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ​గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్దీ.. దాడులు పెరుగుతున్నాయి. అమిత్​ షా, కేసీఆర్​ కలిసి ప్రణాళిక రచిస్తే.. పీయూష్​ గోయల్, కేటీఆర్ కలిసి అమలు చేస్తున్నారు. రోజూ సూర్యుడు అస్తమించగానే వీళ్లు కుట్రలకు పథక రచన చేస్తున్నారు’’ అని రేవంత్​ మండిపడ్డారు. 

బీఆర్ఎస్, బీజేపీ పతనం.. 

నెల రోజులుగా రాష్ట్రంలో ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని.. కానీ బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇండ్లు, ఆఫీసుల వైపు ఆ అధికారులు కన్నెత్తి చూడడం లేదని రేవంత్ ​అన్నారు. ‘‘కేసీఆర్​కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు వెళ్లవు. కాళేశ్వరం కుంగి అవినీతి బట్టబయలైనా ప్రశ్నించవు. కానీ  కాంగ్రెస్ ​నాయకులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ ​వెంకటస్వామి ఇండ్లు, ఆఫీసులపై విరుచుకుపడుతున్నారు” అని మండిపడ్డారు. 

‘‘బీజేపీ, బీఆర్ఎస్ ​పార్టీలను హెచ్చరిస్తున్న. మీ పతనం మొదలైంది. మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది. మీ కవ్వింపు చర్యలతో కాంగ్రెస్​ కార్యకర్తలు మరింత కసి, పట్టుదలతో పని చేస్తున్నారు. ఈ క్షుద్ర రాజకీయాలు, బీజేపీ, బీఆర్ఎస్​ కుట్రలను ఎదుర్కొంటాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని దాడులు చేసినా ఎన్నికల్లో కాంగ్రెస్ ​గెలుపును ఆపలేరు’’ అని అన్నారు.