కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు: రేవంత్ రెడ్డి

సీఎల్పీ నేతగా తనను ఎన్నుకున్నందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మూడు రోజులుగా కొనసాగతున్న సస్పెన్స్ కు కాంగ్రెస్ అధిష్టానం తెరదించుతూ.. అందరూ ఊహించినట్లుగానే రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించింది. డిసెంబర్ 5వ తేదీ రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. 

మరోవైపు అధిష్టానం పిలుపు మేరకు కొద్దిసేపటిక్రితం రేవంత్ రెడ్డి.. ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎంగా ఎంపిక చేసిన కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ రెడ్డి ట్వీట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తనకు  మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పెద్దలు.. మల్లిఖార్జున్ ఖర్గే, కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్,  మాణిక్ రావు థాక్రే లకు ధన్యవాదాలు తెలిపారు. 

ఇక, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలకు రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 7వ తేదీ గురువారం రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.