ప్రవల్లిక కేసును పక్కదోవ పట్టిస్తే ఊరుకునేది లేదు: రేవంత్ రెడ్డి

ప్రవల్లిక కేసును పక్కదోవ పట్టిస్తే ఊరుకునేది లేదు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రవల్లిక కేసును పక్కదోవ పట్టిస్తే తీవ్ర పరిణామాలుంటాయని రాష్ట్ర సర్కార్ ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రవల్లిక ఆత్మహత్యపై స్పందిస్తూ రేవంత్ శనివారం వరుసగా ట్వీట్లు చేశారు. ‘‘ప్రవల్లికకు న్యాయం చేయాలని వేలాది గొంతులు నినదిస్తున్నా సీఎం కేసీఆర్​కు మాత్రం వినపడడం లేదు. ఆ పెద్ద మనిషి పాలనలో మనుషుల ప్రాణాలకూ విలువ లేకుండా పోయింది. ఈ రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదు” అని అన్నారు.

ప్రవల్లిక మృతికి సంతాపం తెలియజేస్తూ.. ‘‘ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన దానివి.. మరికొంత ఆత్మస్థైర్యాన్ని కూడదీసుకోలేకపోయావా? నువ్వు కన్న కలల కోసం మరికొన్నాళ్లు వేచి ఉండలేకపోయావా? నిన్ను కన్నవారి కళ్లల్లో ఆనందం చూడాలన్న సంగతిని మరిచిపోయావా? ఎంతోమందికి దారి చూపాలనుకున్న దానివి.. ఇలా అర్ధంతరంగా నీ ప్రయాణం ముగిస్తావా? నీ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని పేర్కొన్నారు. 

ఈ నక్కలను తరిమికొడదాం.. 

‘‘మన భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఈ నక్కలు ఎక్కడ నక్కినా గుంజుకొచ్చి దోషులుగా నిలబెడదాం. వీళ్ల నక్క జిత్తులను నడి రోడ్డులో నిలబెట్టి తరుముదాం” అని యువతకు రేవంత్ పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్తూ ఎమ్మెల్సీ కవిత పెట్టిన పోస్టుకు కౌంటర్ ఇస్తూ.. ‘‘బతుకమ్మ సంబురాల గురించి రంగురంగుల వీడియోలు పెట్టే ఎమ్మెల్సీ కవితకు.. ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక ఆత్మఘోష వినిపించట్లేదా?’ అని ప్రశ్నించారు.