కొరివితో తల గోక్కోవొద్దు: కేసీఆర్ పై రేవంత్ ఫైర్

కొరివితో తల గోక్కోవొద్దు: కేసీఆర్ పై రేవంత్ ఫైర్
  • తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మర్చిపోవద్దు

హైదరాబాద్: ‘తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర అద్వితీయమైనది. ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అని లెక్క చేయకుండా పోరాడారు. నాడు వారిని టీఆర్ఎస్ అధినేత హోదాలో మీరు కూడా గొప్పగా పొగిడారు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకోవడం అంటే కొరివితో తల గోక్కోవడమే అని ఒకనాడు మీరే చెప్పారు. ఆ విషయాలను మరచి పోవొద్దు’ అంటూ టీపీసీపీ ఉఫాధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఓ బహిరంగ లేఖ ద్వారా సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికుల బతుకులు అద్భుతం చేస్తామంటూ చేసిన ప్రకటనలను మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు రేవంత్. గడిచిన ఐదేళ్లుగా ఆర్టీసీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉసరవెల్లిలా కేసీఆర్..

అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలే ఉండకూడదని, వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యమ సమయంలో ప్రకటనలు చేసిన కేసీఆర్ సీఎం అయ్యాక ఊసరవెల్లిలా రంగులు మార్చారని ఆరోపించారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంగతి దేవుడెరుగు.. ప్రభుత్వ పర్యవేక్షణలోని ఆర్టీసీ కార్మికులనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే మనసు కూడా కేసీఆర్ కు లేకపోయిందన్నారు.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులకు న్యాయం చేయాల్సింది పోయి… ప్రైవేటీకరణతో సంస్థ మనుగడే లేకుండా చేయాలన్న కుట్రకు తెరతీశారని ఆరోపించారు.

పండగ పూట ప్రజలను ఇబ్బంది పెట్టకూడదన్న సోయి కూడా లేకుండా సీఎం కేసీఆర్ నింతృత్వ దోరణిలో వ్యవహరిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిశీలించి తక్షణం పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకోవాలన్నారు.  వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుని కార్మికులతో సమ్మె విరమింపచేసేలా చూడకపోతే, ‘ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుని కొరివితో తల గోక్కోవడమేనన్న మీ ప్రకటన మీకే వర్తిస్తుంది’ అని హెచ్చరించారు.