ఎయిర్పోర్టు నుంచి.. వెనక్కి వెళ్లిన రేవంత్రెడ్డి

ఎయిర్పోర్టు నుంచి.. వెనక్కి వెళ్లిన రేవంత్రెడ్డి

ఢిల్లీ పర్యటన ముగించుకుని.. హైదరాబాద్ వచ్చేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. అనూహ్యంగా మళ్లీ తిరిగి మహారాష్ట్ర సదన్ కు వెళ్లారు. మరికొన్ని నిమిషాల్లో విమానం ఎక్కాల్సిన రేవంత్ రెడ్డికి..రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే నుంచి ఫోన్ రావటం  ఆసక్తి రేపుతోంది.

డిసెంబర్ 6వ తేదీ ఉదయం నుంచి ఢిల్లీలో బిజీగా ఉన్న రేవంత్.. కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలతో సమావేశం అయ్యారు. ప్రమాణస్వీకారానికి రావాలని స్వయంగా ఆహ్వానించారు. పార్టీ అధ్యక్షులు ఖర్గేతో భేటీ అయ్యారు.

మిగతా కాంగ్రెస్ పెద్దలతో చర్చించిన తర్వాత.. హైదరాబాద్ వచ్చేందుకు.. ఎయిర్ పోర్టుకు వచ్చిన రేవంత్ రెడ్డి.. ఊహించని విధంగా మళ్లీ తిరిగి మహారాష్ట్ర సదన్ వెళ్లటం చర్చనీయాంశం అయ్యింది. 

ఇప్పటికే ఢిల్లీలో ఉన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీథర్ బాబులు.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యరావు ఠాగూర్ తో చర్చలు జరిపారు. వారి భేటీ ముగిసిన తర్వాత.. రేవంత్ రెడ్డికి పిలుపు రావటంతో.. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపై సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ 7వ తేదీ.. మరికొన్ని గంటల్లోనే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సమయంలో.. మంత్రివర్గ కూర్పుపైనే.. ఈ అత్యవసర సమావేశం అనే చర్చ నడుస్తుంది.