రాజశేఖర్ రెడ్డికి TSPSC లో ఉద్యోగం ఇప్పించిందే కేటీఆర్ పీఏ: రేవంత్

రాజశేఖర్ రెడ్డికి TSPSC లో ఉద్యోగం ఇప్పించిందే కేటీఆర్ పీఏ: రేవంత్

టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కథ నడిపిందే మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో రేవంత్ నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. కేటీఆర్ పీఏ తిరుపతిది , పేపర్ లీక్ కేసులో ఏ2 నిందితుడు రాజశేఖర్ రెడ్డిది  పక్క పక్క గ్రామాలేనని రేవంత్ వెల్లడించారు.  అసలు రాజశేఖర్ రెడ్డికి టీఎస్ పీఎస్ సీలో  ఉద్యోగం ఇప్పించిందే   కేటీఆర్ పీఏ తిరుపతి అని రేవంత్ ఆరోపించారు. కేటీఆర్ పీఏ తిరుపతి, నిందితుడు రాజశేఖర్ సన్నిహితులందరికీ గ్రూప్1 లో అత్యధిక  మార్కులు వచ్చాయని చెప్పారు రేవంత్.  కేసీఆర్ కు షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ అయితే..మంత్రి కేటీఆర్ కు షాడో మంత్రి పీఏ తిరుపతి అని అన్నారు. గ్రూప్ 1లో 100 కుపైగా మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలను ప్రభుత్వం  బయటపెట్టాలని డిమాండ్ చేశారు రేవంత్.

పేపర్ లీకేజీలో ఇద్దరి వ్యక్తులకే సంబంధం ఉందని కేటీఆర్ ఎలా చెప్తారని ప్రశ్నించారు.  కేటీఆర్ ను బర్తరఫ్ చేయడం కాదని... చంచల్ గూడ జైల్లో పెట్టాలన్నారు. టీఎస్ పీఎస్సీలో  కాన్ఫిడెంటల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి పాత్ర ఏంటో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే నిందితులను కస్టడీలోకి తీసుకున్నారని రేవంత్ విమర్శించారు.  రాష్ట్రంలో ఏ భాగోతం నడిచినా మంత్రి కేటీఆర్ పేషీ నుంచే జరుగుతున్నాయని రేవంత్ ఆరోపించారు. పేపర్ లీక్ కేసులో ప్రభుత్వ పెద్దలను తప్పించడానికి తామే  నేరం చేసినట్లు ఒప్పుకునేలా నిందితులను కస్టడీలో బెదిరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు.   నిందితులను కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి  చంచల్ గూడ  జైల్  సీసీ ఫుటేజ్ ను , వివరాలను ప్రభుత్వం బటయపెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. 

2015 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరీక్ష పేపర్ లీకేజీలో  కొందరికి లబ్ధి జరిగిందని రేవంత్ ఆరోపించారు.  టీఎస్ పీఎస్సీలో పనిచేస్తూ  పోటీ పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. 20 లక్షల మంది అక్రమంగా పరీక్షలు రాశారని ఆరోపించారు రేవంత్. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలన్నారు.