
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరు సంవత్సరాల్లో చేయని పని సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చిన వెంటనే చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ కో ఆపరేటివ్ సొసైటీ ( జేఎన్‌జేహెచ్‌ఎస్)కి ఇళ్ల స్థలాల కోసం సెప్టెంబర్ 8, 2024న, 38 ఎకరాల భూమి మెమోను అందజేసే పండుగ రవీంద్రభారతిలో జరిగింది. 18 ఏళ్ల నుంచి ఇంటి స్థలాల కోసం కన్నులు కాయలు కాసేలా ఎదురుచూసిన జర్నలిస్టుల్లో, వారి కుటుంబాల్లో ఆనందం తాండవించింది. సీఎం రేవంత్‌రెడ్డి 38 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం స్వాధీనం చేసేందుకు సంబంధించిన మెమోను అందించిన వెంటనే అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు.
వైఎస్ హయాంలో..
జేఎన్‌జేహెచ్‌ఎస్ దాదాపు 1100 మంది జర్నలిస్టులతో (సభ్యులుగా) 2008లో ఏర్పాటయింది. కాంగ్రెస్ పార్టీ నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. జేఎన్‌జేహెచ్‌ఎస్ సభ్యులకు ఇళ్ల స్థలాల కోసం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలంలోని నిజాంపేటలో 32 ఎకరాలు, కుత్బుల్లాపూర్ మండలం పేట్ బషీరాబాద్‌లో 38 ఎకరాలు కేటాయించారు.
దాంతో ఈ ఇళ్ల స్థలాల కేటాయింపు సరికాదంటూ ప్రజాప్రయోజనాల వాజ్యం (పిల్) హైకోర్టులో 2008లో దాఖలైంది. ఇళ్లు, ఇంటిస్థలాలు లేనివారికి సభ్యుల నుంచి అఫిడవిట్లు తీసుకుని ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చని హైకోర్టు 2010 జనవరి 5న తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
సుదీర్ఘ విచారణ తర్వాత 2017 మే 2న సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల బెంచి తీర్పు చెబుతూ.. జేఎన్జేహెచ్ఎస్కు 70 ఎకరాలను ఇళ్ల స్థలాల కోసం స్వాధీనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు 2018లో ఆనాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిజాంపేట్ లోని 32 ఎకరాల భూమిని జేఎన్జేహెచ్ఎస్కు స్వాధీనం చేసింది. పేట్ బషీరాబాద్‌లోని 38 ఎకరాల భూమిని స్వాధీనం చేయకపోవడంతో ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి జర్నలిస్టులు తీసుకుపోయారు.
2022 ఆగస్టు 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెబుతూ పేట్ బషీరాబాద్‌లోని 38 ఎకరాలు కూడా జేఎన్జేహెచ్ఎస్కు స్వాధీనం చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పినప్పటికీ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం 38 ఎకరాల భూమి స్వాధీనం చేయలేదు. దాంతో జేఎన్‌జేహెచ్‌ఎస్ సభ్యులు టీం జెజేఎన్జే పేరుతో 2023లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
రేవంత్ రెడ్డి మెమో
2023 ప్రారంభంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి టీంజేఎన్‌జే ప్రతినిధులకు హామీ ఇస్తూ 2023 చివరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాగానే పేట్ బషీరాబాద్‌లోని 38 ఎకరాల భూమిని జేఎన్జేహెచ్ఎస్కు స్వాధీనం చేస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి చెప్పినవిధంగానే ఇచ్చిన హామీ మేరకు 2024 సెప్టెంబర్ 8న ప్రభుత్వం తరఫున రవీంద్రభారతిలో సమావేశం ఏర్పాటు చేసి పేట్ బషీరాబాద్‌లోని భూమిని స్వాధీనం చేసే అధికారిక పత్రాన్ని (మెమోరాండం) అందచేశారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు భూమి స్వాధీనం చేసేందుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ పరిపాలనాపరమైన ఏర్పాట్లు చేస్తుండగానే భూమి కేటాయించడానికి సంబంధించిన జీ.ఓ.లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు 2024 నవంబర్ 25న తీర్పు చెప్పింది.
జర్నలిస్టులకు అండగా ...
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ జర్నలిస్టులకు అండగా నిలుస్తున్నారు. 2008కి ముందు హైదరాబాదులో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జేఎన్జేహెచ్ఎస్కు కూడా ఇళ్ల స్థలాలకు ఇవ్వడానికి ఉన్న న్యాయపరమైన, పరిపాలనాపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
సానుకూలమే..
జేఎన్జేహెచ్ఎస్కు కేటాయించిన భూముల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని స్పష్టమైంది. న్యాయపరంగా, పరిపాలనాపరంగా ఇబ్బందులు రాకుండా న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నారు. పేట్ బషీరాబాద్, నిజాంపేట్ లలో జర్నలిస్టులకు కేటాయించిన భూములు జీహెచ్ఎంసీ పరిధిలో లేకపోవడం వల్ల న్యాయపరమైన సమస్యలు కూడా రాబోవని న్యాయ, పరిపాలనా నిపుణులు చెబుతున్నారు.
ఈ కారణంగానే జేఎన్జేహెచ్ఎస్కు రెండు చోట్లా ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చని గతంలో హైకోర్టు స్పష్టంగా చెప్పింది. సభ్యుల నుంచి అఫిడవిట్లు తీసుకుని స్థలాలు ఇవ్వవచ్చని న్యాయ నిపుణులు సలహా ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇవ్వవద్దని సుప్రీం కోర్టు కూడా ఎక్కడా చెప్పలేదని, ఇప్పటికే ప్రభుత్వానికి సొసైటీ చెల్లించిన 12 కోట్ల 33 లక్షల రూపాయలతోపాటు మార్కెట్ రేట్ ప్రకారం తక్కువ అనుకుంటే మిగతా డబ్బు నిబంధనల ప్రకారం సొసైటీ నుంచి వసూలు చేసుకోవచ్చని న్యాయ నిపుణులు వివరించారు.
శుభసూచకాలు
2008 లో హైకోర్టులో కేసు వేసిన సంస్థలు, వాటి నేతలు డాక్టర్ రావు విబిజె చెలకాని, ఎస్. జీవన్ కుమార్‌లు కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసారు. ఒకవైపు ప్రభుత్వం సానుకూలంగా ఉండటం, మరోవైపు న్యాయ నిపుణులు కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఎలాంటి ఇక్కట్లు లేవని సూచించడం, ఇంకోవైపు కోర్టులో పిల్ దాఖలు చేసిన సంస్థలు వాటి బాధ్యులు సానుకూలంగా ఉండటం శుభసూచకాలుగా భావించవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెమో జారీ చేసి ఏడాది గడిచిన సందర్భంగా జేఎన్జేహెచ్ఎస్కు చెందిన దాదాపు వెయ్యిమంది సభ్యులు ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
రేవంత్ నెరవేరుస్తారని నమ్మకం
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక జర్నలిజం రంగంలో కూడా సంస్కరణల కోసం కృషి చేస్తున్నారు. సమాజం కోసం, జర్నలిజం వృత్తినే ప్రధానంగా భావించి పనిచేస్తున్న నిజమైన పాత్రికేయులకు సముచిత స్థానం ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. చట్టసభలు, పరిపాలనా విభాగం, న్యాయ విభాగం తర్వాత ఫోర్త్ ఎస్టేట్ లేదా నాలుగో స్తంభంగా భావిస్తున్న జర్నలిస్టులు తక్కువ వేతనాలు పొందుతూ, పెన్షన్ సౌకర్యం లేకపోవడం మిగతా మూడు స్తంభాల వారిలాగ సౌకర్యాలు లేకపోవడంతో దుర్భర జీవితం జీవిస్తున్నారు. 1100 మంది సభ్యుల్లో ఇప్పటికే 75 మంది చనిపోయారు.
చనిపోయిన సభ్యుల భార్యలు, కుటుంబ సభ్యులు కూడా రేవంత్ రెడ్డిపై అనేక ఆశలు పెట్టుకుని ఉన్నారు. జీవితం చివరి అంకంలో సొంత ఇల్లు నిర్మించుకుని నివసించాలన్నదే సభ్యులందరి ఆలోచన. ఈ విషయం గమనించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఒకే ఒక్కడు’ తమకు న్యాయం చేస్తారని జర్నలిస్టులు భావిస్తున్నారు. 18 సంవత్సరాలుగా ఇంటి స్థలాల కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టులు రేవంత్ రెడ్డి నిర్ణయం వల్లనే తమకు ఇంటిస్థలాలు లభిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు.
- పి.వి. రమణారావు,
సీనియర్ జర్నలిస్ట్