
- ‘రైజింగ్ తెలంగాణ’ నినాదంతో
- భాగస్వామిగా తెలంగాణ
- రాష్ట్రంలో పెట్టుబడులు, భవిష్యత్
- మౌలిక సదుపాయాలపై ప్రసంగం
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో శుక్రవారం జరగనున్న పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా, ఆర్థిక సమస్యలపై లోతైన చర్చలకు పీఏఎఫ్ఐ గత కొన్నేండ్లుగా వేదికగా పనిచేస్తున్నది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో సెప్టెంబర్ 18, 19వ తేదీల్లో పీఏఎఫ్ఐ తన 12 వార్షికోత్స సదస్సును నిర్వహిస్తున్నది. 12 అన్యూవల్ ఫోరం –2025 (ఇండియా అండ్ ది వరల్డ్) పేరుతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ‘రైజింగ్ తెలంగాణ’ నినాదంతో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా వ్యవహరిస్తున్నది. ఈ సదస్సు రెండో రోజు జరిగే 13 వ సెషన్‌లో స్పీకర్‌గా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ప్రధానంగా దేశంలోనే అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణ సమ్మిళిత భవిష్యత్తు కోసం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్ –2047’ దీర్ఘకాలిక అభివృద్ధి బ్లూప్రింట్‌ను వివరించనున్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు చేస్తున్న కృషిని తెలుపనున్నారు. ప్రధాన పెట్టుబడులు, భవిష్యత్ మౌలిక సదుపాయాలతో.. పెట్టుబడుల గమ్యస్థానాలకు తెలంగాణ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్న తీరును వివరించనున్నారు. ముఖ్యంగా... ‘‘2047నాటికికి తెలంగాణ ప్రాధాన్యత రంగాలు ఏమిటి?, ప్రైవేట్ రంగం సమ్మిళిత– స్థిరమైన వృద్ధికి ఎలా మద్దతిస్తుంది?, రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణ కేంద్రాలను నిర్మించడానికి వ్యాపారాలు ఏ విధంగా దోహదపడతాయి?’అనే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సవివరంగా మాట్లాడుతారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.