రేవంత్​ది అక్రమ మ్యుటేషనే..తేల్చిన ఆర్డీవో

రేవంత్​ది అక్రమ మ్యుటేషనే..తేల్చిన ఆర్డీవో

హైదరాబాద్, వెలుగు: రాజేంద్రనగర్ ​రెవెన్యూ డివిజన్​ పరిధిలోని శేరిలింగంపల్లి మండలం గోపన్‌‌ల్లిలోని సర్వే నంబర్ 127లోని భూమిని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్‌‌, ఎంపీ రేవంత్​ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్​ రెడ్డి అక్రమంగా మ్యుటేషన్ చేయించుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్​కుమార్‌‌కు ఆర్డీఓ చంద్రకళ మంగళవారం నివేదిక సమర్పించారు. రేవంత్​రెడ్డి, కొండల్ రెడ్డికి 127వ సర్వే నంబర్​లో  1.21 ఎకరాల భూమిని ఎరగండ్ల లక్ష్మయ్య సన్నాఫ్‌‌ మల్లయ్య అమ్మినట్లుగా ఉందని, కానీ గత రికార్డుల ప్రకారం చూస్తే ఎక్కడా ఆ ఇంటి పేరుతో పట్టాదారు లేరని నివేదికలో పేర్కొన్నారు. ఈ సర్వే నంబర్​లో 1954 ‌‌‌‌ – 55 నుంచి ఎర్‌‌ఆర్​యూపీ నిర్వహించే వరకు పహానీలో ఎవరెవరి పేర్లు వచ్చాయో నివేదికలో వివరించారు. సర్వే నంబర్​ 126లో ఉన్న కోమటిచెరువులోకి నీళ్లు వెళ్లకుండా ఎఫ్‌‌టీఎల్​ నిబంధనలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి, కొండల్​ రెడ్డి, కృష్ణారెడ్డి గోడ నిర్మించారన్నారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా ఉన్న ఈ గోడను కూల్చివేయాలని నివేదికలో తెలిపారు.  ఈ. శ్రీశైలం, కల్లం పేరిరెడ్డి, ఈ.అనిల్ కుమార్, బి.భాస్కర్, ఎన్​పీ రాజు, కె.శేఖర్​రెడ్డి, మసీద్​ శ్రీకాంత్, కె.జయలక్ష్మి, ఆశమ్మ, సాబేరా బేగం మొదలైనవారితోపాటు  మరికొందరు ఇచ్చిన వాంగ్మూలాలను ఈ సందర్భంగా నివేదికలో నమోదు చేశారు. ఇవే భూముల విషయంలో కొండల్‌‌ రెడ్డికి ఎన్​పెద్దిరాజు మధ్య నడుస్తున్న కేసును గతంలో గచ్చిబౌలి స్టేషన్​ హౌస్​ ఆఫీసర్​ ఎలాంటి కారణాలు లేకుండానే పక్కన పెట్టారని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును రీ ఓపెన్​ చేయడం జరిగిందని, ఈ కేసు పురోగతి గురించి గచ్చిబౌలి ఎస్‌‌హెచ్ఓకు శేరిలింగంపల్లి తహసీల్దార్​ లేఖ రాశారని వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అన్ని పక్షాలకు నోటీసులు అందజేసి సపోర్టింగ్​ డాక్యుమెంట్స్​ఆధారంగా ఇంకా సమగ్రంగా విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ విచారణనుపూర్తి చేసి, పూర్తి స్థాయి నివేదికను సమర్పిస్తామన్నారు