
- ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలూ హాజరు
హైదారాబాద్, వెలుగు: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో బుధవారం రాత్రి డిన్నర్ మీటింగ్ జరిగింది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ హాజరయ్యారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో చెప్పినట్టు తెలిసింది. ఆయా ఎమ్మెల్యేలకు చెందిన నియోజకవర్గాల అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయిస్తామని కూడా చెప్పినట్టు సమాచారం. త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పినట్టు తెలిసింది.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు కృషి చేయాలని సీఎం రేవంత్ కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చలకు ప్రాధాన్యం ఇచ్చామని, గత ప్రభుత్వానికి భిన్నంగా సభను నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు.