
- ఈసారి 54 కేసులు
- మున్సిపల్లో 25
- ఈ ఏడాది 173 కేసులు
- గతేడాదితో పోలిస్తే 34 అధికం
- రిపోర్టు విడుదల చేసిన ఏసీబీ
హైదరాబాద్,వెలుగు:
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిపోతోంది. ఆఫీసర్లు లంచాలు తీసుకుంటూ, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతూ ఏసీబీకి చిక్కుతున్నారు. వీరిలో అసిస్టెంట్ స్థాయి నుంచి హైలెవల్ఆఫీసర్వరకు ఉన్నారు. పోయినేడుతో పోలిస్తే ఏసీబీ కేసుల సంఖ్య 34 పెరిగింది. ఈ ఏడాది నమోదైన కేసుల వివరాలను ఏసీబీ కార్యాలయం శనివారం వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం ఈసారి మొత్తం 173 కేసులు నమోదు కాగా 179 మందిని రిమాండ్‌కు తరలించారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్లో అత్యధికంగా 54 మంది, మున్సిపల్, అర్బన్ డెవలప్ మెంట్లో 25 మంది, పోలీస్ డిపార్ట్ మెంట్ లో 18 మంది ఏసీబీకి దొరికారు. ఎప్పటిలాగే ఈ మూడు డిపార్ట్మెంట్లు ఈసారి కూడా టాప్ త్రీలో నిలిచాయి. పంచాయతీరాజ్, ఆర్టీఓ, సబ్ రిజిస్ట్రార్, ఎలక్ట్రిసిటీ, ఫిషరీస్,హెల్త్, ఫారెస్ట్, ల్యాండ్సర్వే డిపార్ట్మెంట్స్లో కొంతమంది అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. బాధితులకు న్యాయం జరిగేలా కోర్టులో వాదించాల్సిన ఇద్దరు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా ఈసారి ఏసీబీకి దొరికిన వారిలో ఉండడం గమనార్హం. ఏసీబీ ఈ ఏడాది 133 ట్రాప్ కేసుల్లో 145 మంది ఆఫీసర్లను అరెస్టు చేసింది. 9 మందిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది నమోదైన కేసుల్లో ఈఎస్ఐ స్కామ్అతి పెద్దది. రూ.200 కోట్ల విలువైన ఈ కుంభకోణంలో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా 22 మందిని ఏసీబీ అరెస్టు చేసింది.
రెవెన్యూ టాప్…
లంచాలు అడగడంలోనూ, అధిక మొత్తంలో తీసుకోవడంలోనూ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌నే టాప్‌లో ఉంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట్ తహసీల్దార్ నాగజ్యోతి రూ.6.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికింది. ఈ ఏడాది నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఇక అతి తక్కువగా రూ.700 లంచం తీసుకుంటూ హైదరాబాద్ ఆజంపురా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మహ్మద్ అజహర్ చిక్కాడు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కదరి అనిత రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట్ తహసీల్దార్ లావణ్య రూ.4 లక్షలు, కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట తహసీల్దార్ కంకనాల రవిరాజకుమార్ రావు రూ.2లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. లావణ్య కేసులో మరో ముగ్గురిని కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది.