నవంబర్​ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.950 కోట్లు

నవంబర్​ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.950 కోట్లు
  • పోయిన నెలతో పోలిస్తే  రూ.127 కోట్లు ఎక్కువ
  • 8 నెలల్లో రిజిస్ట్రేషన్స్​ శాఖకు రూ.5,777 కోట్ల ఆమ్దానీ
  • భూముల విలువలు పెంచినంక పెరిగిన రాబడి 

హైదరాబాద్​, వెలుగు:స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్ల శాఖకు ఐదు నెలలుగా ఆమ్దానీ జోర్దార్​గా వస్తోంది. భూముల విలువలు, రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపు తర్వాత నెలనెలా రాబడి ఎక్కువైంది. ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ మొదలయ్యాక మొదటి మూడు నెలలు ఆదాయం అంతంతే ఉన్నా.. తర్వాత రాబడి రెట్టింపైంది. గత ఎనిమిది నెలల్లో రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.5,777 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్క నవంబర్​ నెలలోనే రూ.950 కోట్లు వచ్చాయి. ఈ ఫైనాన్షియల్​ ఇయర్ లో ఇప్పటిదాకా ఎక్కువగా జులైలో రూ.991 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత నవంబర్​ ఆదాయమే రెండో హయ్యెస్ట్​ కావడం విశేషం.  
చార్జీలు పెంచాకనే..
రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్​, నాన్​ అగ్రికల్చర్​ భూములు, ఆస్తుల మార్కెట్​ విలువలు, రిజిస్ట్రేషన్​ చార్జీలను ఏరియాను బట్టి 30 నుంచి 50 శాతం పెంచింది. జులై 22 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. భూముల విలువలు, రిజిస్ట్రేషన్​ చార్జీలు పెంచకముందు రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రతినెలా రూ.500 కోట్ల ఆదాయమే వచ్చేది. పెంపు తర్వాత గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 40 శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో టార్గెట్​గా పెట్టుకుంది.

ఇప్పటిదాకా వచ్చిన రాబడిని బట్టి చూస్తే.. 2022 మార్చి నాటికి అది రూ.10 వేల కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఏప్రిల్​లో రూ. 582 కోట్లు రాగా, మే నెలలో లాక్​ డౌన్​ వల్ల కేవలం రూ.138 కోట్లే వచ్చాయి. జూన్​లో రూ.630 కోట్ల ఆదాయం సమకూరింది. రిజిస్ట్రేషన్​ చార్జీలు పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో జులై రెండో వారం, మూడో వారం రిజిస్ట్రేషన్లు చాలా ఎక్కువగా జరిగాయి. దీంతో ఆ ఒక్క నెలలోనే రూ.991 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఆగస్టులో రూ.775 కోట్లు , సెప్టెంబర్​లో రూ.888 కోట్లు, అక్టోబర్​లో రూ.823 కోట్ల రాబడి వచ్చింది.