ఎత్తిపోసిందంతా వరదపాలు

ఎత్తిపోసిందంతా వరదపాలు
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు రివర్స్​ ఎఫెక్ట్
  • లిఫ్ట్ చేసింది 12 టీఎంసీలు
  • వరద పాలైంది 196 టీఎంసీలు
  • మేడిగడ్డ, అన్నారం   బ్యారేజీల గేట్లు ఓపెన్​
  • త్రివేణీ సంగమం వద్ద 10 మీటర్లు
  • హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు 

వెలుగు, కాటారం,  జయశంకర్​ భూపాలపల్లి: నలభై రోజుల పాటు… కాళేశ్వరం భారీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోసిన  నీళ్లన్నీ వృథా అయ్యాయి.  గోదావరి నీటిని దిగువ నుంచి ఎగువకు… మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం వరకు  లిఫ్ట్ చేసిన నీరంతా వరదలో  కొట్టుకుపోయింది. వరుసగా కురిసిన వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహించింది. మానేరు  నది నుంచి వరద రావటంతో అన్నారం బ్యారేజీలో నిల్వ చేసిన నీటికి ప్రభుత్వం గేట్లు తెరిచింది.  ఇప్పటివరకు కన్నెపల్లి పంప్​ హౌస్​ నుంచి లిఫ్ట్ చేసి నిల్వ చేసిన నీటిని దిగువకు వదిలేసింది.  ఈ నీరంతా వరదగా మారి మేడిగడ్డ వైపు పరవళ్లు తొక్కింది. ఇప్పటికే ప్రాణహిత దూకుడుతో కాళేశ్వరం సమీపంలో గోదావరి ఉప్పొంగుతోంది. శనివారం కూడా అదే వరద హోరు కొనసాగింది. అన్నారంలో వదిలేసిన నీరు కూడా తోడవడంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఔట్​ ఫ్లో మరింత పెరిగింది. శనివారం కూడా మేడిగడ్డ వద్ద  గేట్లు తెరిచే ఉంచారు. 4.89 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు  పోతోందని ఇరిగేషన్​ విభాగం బులెటిన్​ విడుదల చేసింది. ఇన్ని రోజులుగా చేసిన ప్రయత్నమంతా వరద పాలైందని ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు.  ఈనెల 30 నుంచి శనివారం వరకు అయిదు రోజుల్లోనే దాదాపు 196 టీఎంసీల నీరు మేడిగడ్డ బ్యారేజీ దాటి వృథాగా పోయిందని అధికారులు  అంచనా వేశారు. ఇరవై రోజుల్లో కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల మూడు పంప్​హౌస్​​ల ద్వారా 12 టీఎంసీల గోదావరి నీటిని ప్రభుత్వం  ఎత్తిపోసింది. భారీ పంప్​లను నడిపేందుకు దాదాపు రూ.30 కోట్లు  కరెంటు బిల్లు చెల్లించింది. అయిదు రోజులుగా కురిసిన వర్షాలతో సీన్​ రివర్సయింది. గత నెల 21 నుంచి మేడిగడ్డ నుంచి  గోదావరి నీటిని వెనక్కి అన్నారానికి ఎత్తిపోయగా, ఇప్పుడు అన్నారం నుంచి దిగువకు వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజుకు రెండు టీఎంసీల నీళ్లను ఎత్తిపోసే  పంప్​లన్నీ బంద్​ చేయటంతో పాటు..  అన్నారం గేట్లు ఎత్తి.. నీటిని వదిలేయాల్సి వచ్చింది. శుక్ర, శనివారాల్లోనే మేడిగడ్డ పాయింట్​ నుంచి 40 టీఎంసీల నీరు దిగువకు తరలి వెళ్లిందని అధికారులు చెబుతున్నారు.  మానేరు నుంచి వరద ప్రవాహం పెరిగినా, గోదావరిలో ఎల్లంపల్లికి వరద పెరిగినా ఇంకా ఎక్కువ నీటిని దిగువకు వదలాల్సి ఉంటుంది.

మానేరు పొంగడంతో మారిన సీన్​; 

మహాదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. మానేరు నుండి గోదావరి నది ద్వారా 18,216 క్యూసెక్కుల వరద అన్నారం బ్యారేజీ కి చేరుతుందని ఇరిగేషన్ ఆఫీసర్ లు తెలిపారు.దీనితో అన్నారం వద్ద ఎఫ్ ఆర్ ఎల్ 119 మీటర్ లకు గాను దాదాపు పూర్తి స్తాయి 118.5 ని చేరుకున్నది.10.87 టీఎంసీ ల కేపాసిటీకి గాను 9.5 టీఎంసీ లకు చేరుకోవడంతో శుక్రవారం నుండి గేట్లను ఎత్తి అధికారులు నీటిని కాళేశ్వరం వైపుకు వదులుతున్నారు.శనివారం వరద ఉదృతి పెరుగుతుండడం తో అన్నారం బ్యారేజీ వద్ద 2 వ బ్లాక్ లోని 12 గేట్లను , 3 వ బ్లాక్ లోని 2 గేట్లను మొత్తం 14 గేట్లను తెరిచి 63,041 క్యూసెక్కుల నీరు కిందికి వదిలారు.గోదావరి లో ఇంకా వరద ప్రభావం పెరుగుతుండడం వల్ల ఆదివారం ఉదయానికి వరద ప్రభావాన్ని బట్టి తగినన్ని గేట్లను ఓపెన్ చేసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.

పుష్కర ఘాట్  వద్ద 10 మీటర్లు ఎత్తున వాటర్

అటు ప్రాణహిత నది ఇటు వైపు గోదావరి నది నుండి వాటర్ పుష్కలంగా వస్తుండడంతో కాళేశ్వరం త్రివేణీ సంగమ  పుష్కర ఘాట్ వద్ద మెట్ల పై నుండి వరద నీళ్ళు వెళ్తున్నాయి.సుమారు 10 మీటర్ ల హైట్ తో వాటర్ వెళ్తుండడం తో హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. పుణ్య స్నానలకోసం వచ్చే భక్తులు,సందర్శకులు,ప్రజలు మెట్ల వద్ద ఏర్పాటు చేసిన బారీకేడ్ లను దాటి నదిలోకి వెళ్ళవద్దని హెచ్చరించారు.