
- ఇందు కోసం త్వరలో చట్ట సవరణ
- పంచాయతీ, రెవెన్యూలోని అవినీతి ఉద్యోగులను సస్పెండ్ చేసే పవర్ కూడా వాళ్లకే
- జడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల సమావేశంలో సీఎం కేసీఆర్!
- అభివృద్ధిలో ముందుండే జిల్లాకు రూ. 10 కోట్లు ఇస్తం
- జడ్పీ చైర్పర్సన్లకు కొత్త కార్లు కొనిస్తమన్న ముఖ్యమంత్రి
ప్రజలకు అనేక సమస్యలుంటయి. వాటి పరిష్కారం కోసం మీదగ్గరికి వస్తరు. ఓపికగా వాళ్ల సమస్యలు వినండి. కూసోబెట్టి మర్యాద చేయండి. అప్పుడే వాళ్లకు రిలీఫ్ వస్తది. ఆ తర్వాత వాళ్ల సమస్యలను ఎట్ల పరిష్కరించాల్నో ప్రయత్నం చేయండి. పదవి వచ్చిందని మన సహజత్వాన్ని కోల్పోవద్దు. అట్ల చేస్తే మన వెనుక ఉన్న జనం నవ్వుతరు. లేనిపోని దర్పం తెచ్చుకోవద్దు. మంచి పనులు చేయడానికి పెట్టుబడి అవసరం లేదు. సరళంగా మాట్లాడటమే మనకు పెట్టని కోట.– జడ్పీ చైర్పర్సన్లతో సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ వ్యవస్థను జడ్పీ చైర్పర్సన్ల పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు అవసరమైన చట్టసవరణ కూడా చేయబోతున్నది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ జడ్పీ చైర్పర్సన్లతో అన్నట్లు సమాచారం. కొత్తగా ఎన్నికైన 32 జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లతో ఆయన మంగళవారం ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలను వారికి వివరించారు. గంటన్నరపాటు సీఎం కేసీఆర్ వివిధ అంశాలపై మాట్లాడారు. అభివృద్ధిలో ఏ జిల్లా పరిషత్ ముందుంటే ఆ జిల్లాకు ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.10 కోట్లిస్తామని ప్రకటించారు.
‘‘జడ్పీ చైర్పర్సన్లకు ఇదివరకు అధికారాలు లేవు. ఇకపై జిల్లా పాలనా బాధ్యతలు మొత్తం మీ (జడ్పీ చైర్పర్సన్ల) ఆధీనంలోకి తీసుకువస్త. రెవెన్యూ వ్యవస్థను సైతం మీ పరిధిలోకి తీసుకురాబోతున్నం. ఇందుకు అవసరమైన చట్ట సవరణ త్వరలోనే చేయబోతున్నం” అని సీఎం అన్నట్లు సమావేశం అనంతరం పలువురు జడ్పీ చైర్పర్సన్లు మీడియా దృష్టికి తెచ్చారు. జడ్పీ చైర్పర్సన్లకు అధికారాల బదలాయింపు కోసమే కొత్త సర్పంచులకు ఇంతవరకూ చెక్ పవర్ ఇవ్వలేదని, జడ్పీ చైర్పర్సన్ల అధికారాలను తేల్చాక సర్పంచులకు చెక్ పవర్ ఇస్తామని, అందుకు ఇంకా కొంత సమయం పడుతుందని సీఎం చెప్పినట్లు వారు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థతోపాటు రెవెన్యూ వ్యవస్థలోనూ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే సస్పెండ్ చేసే అధికారాన్ని కూడా జడ్పీ చైర్పర్సన్లకే కట్టబెడతామని ఆయన అన్నట్లు సమాచారం. జడ్పీ చైర్పర్సన్లు బాధ్యతలు స్వీకరించేలోగా అధికారాల బదలాయింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది.
జడ్పీ చైర్పర్సన్లకు బంపర్ ఆఫర్
అభివృద్ధిలో ఏ జిల్లా పరిషత్ ముందువరుసలో ఉంటే ఆ జిల్లాకు ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ. 10 కోట్లు ఇస్తామని జడ్పీ చైర్పర్సన్లకు సీఎం కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు. పనితీరుతో జిల్లాలో మంచి మార్పు తీసుకురావాలని వారికి సూచించారు. నిర్దేశిత లక్ష్యాలు ఛేదించి, గ్రామాల వికాసానికి దోహదపడ్డ జడ్పీలను గుర్తించి ఎంపిక చేస్తామని, ఒక్కటి కంటే ఎక్కువ జడ్పీలు ముందుకు పోతే వాటన్నింటికీ రూ.10 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పారు. ‘‘నాకైతే 32 జిల్లాలు అగ్రభాగాన నిలువాలని ఉంది. ఇందుకు కొన్ని బెంచ్ మార్కులు, ప్రమాణాలు ఏర్పాటు చేస్తం. అందరూ కష్టపడి పనిచేసి రూ. 10 కోట్ల చొప్పున పొందాలె..’’ అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. జడ్పీ చైర్పర్సన్లందరికీ కొత్త కార్లు కొనిస్తామని ఆయన ప్రకటించారు. ఇదివరకు జడ్పీ చైర్పర్సన్లకు పెద్దగా పని ఉండేదికాదని, ఇటీవల కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఈ వ్యవస్థ గురించి తాను చెప్పానని సీఎం అన్నారు.
‘‘జడ్పీ చైర్పర్సన్లకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక సంఘంతో చెప్పిన. ఇక ముందు క్రియాశీలంగా పనిచేస్తరని కూడా చెప్పిన. అందుకు అవసరమైన సహాయం చేస్తమని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాట ఇచ్చిన్రు. ఎట్లయినా మీ వ్యవస్థను పట్టిష్టం చేయాలని ఆలోచన చేస్తున్నం. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అధికారాలను బదలాయిస్తం. పరిషత్ ఎన్నికల్లో ఇంత ఏకపక్షంగా తీర్పు ఎప్పుడూ రాలేదు. దీంతోపాటే మీ బరువు, బాధ్యతలు పెరిగినయి. మీ పాత్ర ఉన్నతంగా ఉండాలె. జడ్పీలు క్రియాశీలం కావాలె. మీ విధులు.. మీ బాధ్యతలు పటిష్టం కావాలె’’ అని సూచించారు.
జడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లకు సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ ఉద్యమాన్ని వివరించారు. అధికార వికేంద్రీకరణ జరగాలనే పంచాయతీరాజ్ ఉద్యమాన్ని తెచ్చారని, దీనికి మొట్టమొదటి పేరు కమ్యూనిటీ డెవపలప్‌మెంట్ అని అన్నారు. పంచాయతీ రాజ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎస్కే డే ప్రస్థానాన్ని తెలియజేశారు. చాలాకాలం పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో స్థానిక సంస్థలు పనిచేశాయని, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ బ్రహ్మాండంగా ఉండేదని చెప్పారు. ఇప్పుడు ఆ స్ఫూర్తి కొరవడిందని, ఏ ఊరికి పోయినా పెంటకుప్పలను తలపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగు పడుతుందన్నారు. జడ్పీ చైర్పర్సన్లంతా బాగా చదువుకున్న వారని, పరిస్థితులను అర్థం చేసుకొని పల్లెల అభివృద్ధికి ప్రతిజ్ఞ చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఏ స్ఫూర్తితో ఎస్కే డే పంచాయతీరాజ్ వ్యవస్థను ఆరంభించారో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలని సూచించారు.