
తన పెంపుడు పిల్లి తప్పిపోయిందంటూ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు ఓ మహిళ. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. తన పిల్లి ఆచూకీ చెప్పిన వారికి ఏకంగా 30 వేల రూపాయల రివార్డు ఇస్తానంటూ ప్రకటించారు.
హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన సెరీనా.. చిన్నతనం నుండి ఇంట్లో పలు రకాల జంతువులను పెంచుతోంది. గత 8 నెలల క్రితం అప్పుడే పుట్టిన జింజర్ అనే పిల్లిని దత్తత తీసుకుంది. అప్పటి నుండి జింజర్ ను ప్రేమగా పెంచుకుంటోంది. కరోనా కారణంగా పిల్లికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేందుకు జూబ్లీహిల్స్ లోని (ట్రస్టీ ) పెట్ క్లినిక్ కు తీస్కెళ్లి జూన్ 17 న సర్జరీ చేయించింది. స్టిచెస్ వేసిన దగ్గర స్వెల్లింగ్ రావడంతో తిరిగి జూన్ 23న అదే ఆస్పత్రికి తీసుకెళ్లింది. ట్రీట్మెంట్ జరుగుతుండగా జూన్ 24న అక్కడి నుంచి పిల్లి తప్పిపోయిందంటూ హాస్పిటల్ సిబ్బంది ఆమెకు సమాచారం ఇచ్చారు. దీనితో ఆస్పత్రి వారిని నిలదీయడంతో వారి నుండి నిర్లక్ష్యంగా సమాధానం వచ్చిందని తెలిపారు.
దీంతో పెంపుడు పిల్లి కనిపించడం లేదంటూ జూన్ 27న రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. తానే స్వయంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో పాంప్లెంట్స్ పంచుతూ తిరిగినా ఉపయోగం లేకపోయింది. దీంతో హైదర్ గూడ లో ఏర్పటు చేసిన సమావేశంలో తన బాధను మీడియా తో పంచుకుంది. తన పిల్లి ఆచూకీ కోసం గత 20 రోజులుగా వెతుకుతున్న లాభం లేకపోవడంతో.. పిల్లి ఆచూకీ తెలిపిన వారికి 30 వేల రివార్డును ప్రకటించింది.