రాజకీయ నేతల ఆస్తులు జనానికి పంచండి : మేం చెప్పినట్లు రాజ్యాంగం రాయండి

 రాజకీయ నేతల ఆస్తులు జనానికి పంచండి : మేం చెప్పినట్లు రాజ్యాంగం రాయండి

నేపాల్ దేశం అట్టుడుగుతూ ఉంది. కుర్రోళ్లు అస్సలు వెనక్కి తగ్గటం లేదు. రాజకీయ నేతల భరతం పట్టిన తర్వాత.. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి.. శాంతి చర్చల కోసం సైన్యం పిలుపునిచ్చింది. ఇక్కడే నేపాల్ యువత కొన్ని డిమాండ్లను సైన్యం ముందుంచారు. ఆ డిమాండ్లు ఏంటో తెలుసుకుందామా..

ఫస్ట్.. రాజ్యాంగాన్ని మళ్లీ తిరగ రాయండి. ఈ కాలానికి తగ్గట్టు.. ఇప్పటి అవసరాలకు తగినట్లు రాజ్యాంగాన్ని సంస్కరించాలనే ప్రధాన డిమాండ్ సైన్యం ముందు ఉంచారు. రాజ్యాంగాన్ని మార్చుతూనే పాలనలో సంస్కరణలు తీసుకురావాలని.. అవినీతి లేని పాలన ఉండాలనే డిమాండ్ ప్రధానంగా వినిపించారు. రాజకీయ నేతలు అక్రమంగా.. అన్యాయంగా సంపాదించిన లక్షల కోట్లను జాతీయం చేసి.. జనానికి పంచాలని డిమాండ్ చేస్తున్నారు నేపాల్ యువత. 3 దశాబ్దాలు అంటే 30 ఏళ్లల్లో ఏ రాజకీయ నేత ఎంత సంపాదించాడు.. ఎంత అవినీతి చేశాడు అనేది విచారణ చేసి.. ఆ ఆస్తులను జాతీయం చేయాలనే డిమాండ్ ను ప్రధానంగా వినిపిస్తున్నారు యువత.

మరికొన్ని కీలక డిమాండ్లు ఇలా ఉన్నాయి : 

>>> ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. వాళ్ల అధికారాలు అన్నింటినీ రద్దు చేయాలి. 
>>> రాజ్యాంగం సవరణ చేసే సమయంలో.. యువత, మేధావుల ఆలోచనలతోపాటు వారి భాగస్వామ్యం ఉండాలి. 
>>> తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మళ్లీ  ఎన్నికలు నిర్వహించాలి. ఆ ఎన్నికలు న్యాయ బద్దంగా జరగాలి. అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలి.
>>> 30 ఏళ్లుగా రాజకీయ నేతలు, రాజకీయ పార్టీల నేతల ఆస్తులపై విచారణ జరపాలి. బినామీ ఆస్తులు అన్నింటినీ జాతీయం చేయాలి. అక్రమంగా సంపాదించిన ఆస్తులను దేశ ప్రయోజనాలకు ఖర్చు చేయాలి. 
>>> విద్య, వైద్యం, న్యాయం, భద్రత, కమ్యూనికేషన్.. ఈ ఐదు రంగాల్లో సంస్కరణలు తీసుకురావాలి. ఈ ఐదు రంగాలకు ప్రజలకు ఉపయోగపడేలా.. అందరికీ విద్య, వైద్యం, న్యాయం అందిలే సంస్కరణలు తీసుకురావాలి. 

ఈ డిమాండ్లు, సంస్కరణలకు ఒప్పుకోవాలని.. లేకుంటే ఆందోళనలు కొనసాగిస్తామని యువత తెగేసి చెప్పింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సిందే అని.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజ్యాంగ సవరణలతోపాటు ఈ సంస్కరణలు తీసుకొస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ సైన్యం ముందు తమ డిమాండ్లను ఉంచింది నేపాల్ యువత. దీనిపై సుదీర్ఘంగా సాగుతున్న చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని.. దీనికి కొంత సమయం పడుతుందని.. అప్పటి వరకు నిరసనలు, ఆందోళనలు విరమించాలని సైన్యం కోరుతుంది.