వానాకాలంలో వరి వేసుకోవచ్చు..ఎలాంటి ఆంక్షలుండవ్​ 

వానాకాలంలో వరి వేసుకోవచ్చు..ఎలాంటి ఆంక్షలుండవ్​ 
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయం
  • 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు ఏర్పాట్లు
  • కంది సాగు డబుల్​ చేసేందుకు ప్రణాళిక​
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ 

హైదరాబాద్‌, వెలుగు:  వానాకాలం పంటల సాగుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఏ పంట ఎంత వేయాలి, విత్తనాల ఏర్పాటు, ఎరువుల నిల్వలు తదితర అంశాలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా వానాకాలంలో వరి పంటపై ఆంక్షలు విధించకూడదని నిర్ణయించింది. పత్తి, కంది పంటలను మరింత ప్రోత్సహించాలనుకుంటున్నది. ఏటా వానాకాలంలో వరి సాగు 40 లక్షల ఎకరాలకు మించొద్దని ఆంక్షలు విధించే వ్యవసాయ శాఖ  వచ్చే సీజన్‌లో ఎంతైనా వరి వేసుకొచ్చని చెప్తున్నది. వానాకాలం పంటలో కేంద్రం నిర్దేశించిన టార్గెట్‌ కంటే తక్కువ ధాన్యం మార్కెట్‌కు వస్తుండడంతో వరి సాగుపై ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. పైగా వానాకాలంలో పండే రా రైస్‌తో సమస్య ఉండదని, పంట కూడా చాలా వరకు అవసరాలకు నిల్వ చేసుకునే వీలుంటుందని అధికారులు అంటున్నారు. 
పత్తి, కంది సాగు పెంపు
గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్కెట్‌లో పత్తికి ధర పలుకుతున్నది. వచ్చే సీజన్‌లో 80 లక్షల ఎకరాలకు పత్తిసాగును పెంచాలని వ్యవసాయశాఖ భావిస్తున్నది. దీనికి సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలని సీడ్‌ కంపెనీలను ఆదేశించింది.  రాష్ట్రంలో కోటి ఎకరాల వరకు పత్తి పంటను విస్తరించే అవకాశాలు ఉన్నాయని, కనీసం 80 శాతం వరకు రైతులతో ఈ పంటను సాగు చేయించాలని అంచనా వేస్తున్నది. పత్తి కొనుగోలుకు సమస్య ఉండదని, ఎంత ఎక్కువ దిగుబడి వచ్చినా సీసీఐ ద్వారా కేంద్రమే కొనుగోలు చేస్తుందని అధికారులు అంటున్నారు.
అదేవిధంగా కంది సాగును కూడా భారీగా పెంచాలని వ్యవసాయ శాఖ భావిస్తున్నది. దేశవ్యాప్తంగా కందులకు డిమాండ్‌ ఉంది. దీంతో పాటు ఇతర దేశాల నుంచి కందుల దిగుమతులను నిలిపివేయడంతో ఆ పంటకు మార్కెట్‌లో డిమాండ్‌  పెరిగింది. ఈ నేపధ్యంలో రాష్ట్రం సాధారణ సాగు కంటే కంది పంటను డబుల్‌ చేయాలని వ్యవసాయశాఖ అంచనాలు రూపొందిస్తున్నది. వచ్చే సీజన్‌లో 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాలకు విస్తరించాలని భావిస్తున్నది. 
సోయా సాగు  రైతులదే భారం 
సోయాసాగుకు రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌, ఆసీఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల్లో సోయా సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. అయితే విత్తనాలు అందుబాటులో లేక సమస్య ఎదురవుతున్నది. నిరుడు రాష్ట్ర విత్తన సంస్థ సోయాకు టెండర్లు పిలువగా ముందుకు వచ్చిన మహారాష్ట్ర సంస్థ చివరి నిమిషంలో విత్తన సరఫరాపై చేతులెత్తేసింది. దీంతో నిరుడు భారీగా విత్తన కొరత ఏర్పడింది. అయితే ఈసారి కూడా పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉన్నందున సోయా సాగు భారం రైతులకే బాధ్యత ఇస్తూ చేతులెత్తేసేందుకు సిద్ధమైంది.