చేతికందే టైంలో మాడుతున్న వరిపంట.. నిండా ముంచిన దోమపోటు

చేతికందే టైంలో మాడుతున్న వరిపంట.. నిండా ముంచిన దోమపోటు

చేతికందే టైంలో మాడుతున్నది

వరి రైతును ముంచిన దోమపోటు

నాలుగైదుసార్లు మందులు కొట్టినా లాభం లేదు

భారీగా నష్టపోయిన రైతులు

పలుచోట్ల పంటచేలకు నిప్పు

సర్కారు ఆదుకోవాలని డిమాండ్​

నెట్​వర్క్​, వెలుగు: ఈ వానకాలం సీజన్​లో కురిసిన భారీవర్షాలు, ఎక్కువ టైం మబ్బులతో కూడిన వెదర్​ వల్ల  రాష్ట్రవ్యాప్తంగా వరికి దోమపోటు వచ్చింది. మరీ ముఖ్యంగా సన్నరకాలకు ఎక్కువ నష్టం జరిగింది. ఆఫీసర్ల అంచనా ప్రకారం3 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంట దోమపోటుతో దెబ్బతిన్నది.  రైతులు పంటను కాపాడుకునేందుకు వేలకువేలు ఖర్చుచేసి, నాలుగైదుసార్లు ఫెస్టిసైడ్స్​ పిచికారీ చేసినా ఫలితం కనిపించలేదు. వరి ఎక్కడికక్కడ ఎండిపోయి సగానికి సగం గింజలు తాలుగా మారాయి. పంట కోస్తే కనీసం పశుగ్రాసానికి కూడా పనికివచ్చే చాన్స్​ లేకపోవడంతో పలుచోట్ల రైతులు చేన్లకు చేన్లే తగలబెడుతున్నారు.

సన్నవరికే  సమస్య ఎక్కువ..

ఈ వానాకాలం సీజన్​లో రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. అందులో సుమారు 24 లక్షల ఎకరాల్లో బీపీటీ(సాంబమసూరి), తెలంగాణ మసూరి లాంటి సన్నాలు పండించారు. సహజంగా దొడ్డు రకాల కంటే సన్నరకాలకే చీడపీడలు ఎక్కువ. కానీ ఈ వానకాలం సీజన్​లో కురిసిన భారీవర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా సన్నవరితోపాటు దొడ్డురకాలకు కూడా దోమపోటు వచ్చినట్లు అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు. దోమపోటు సోకిన పంటలను పరిశీలించినప్పుడు దొడ్డు, సన్నరకాలు 70:30 శాతంలో ఎఫెక్ట్​ అయ్యాయని అంటున్నారు. అంటే సుమారు 2లక్షల ఎకరాల్లో సన్నాలు, లక్ష ఎకరాల్లో దొడ్డు వరి దెబ్బతిన్నట్లు అంచనా వేశారు.  ఎక్కువ టైం మబ్బులతో కూడిన వెదర్​ వల్ల ఈసారి మొదటి నుంచీ వరిని చీడపీడలు ఎక్కువగా ఆశించాయి. దీంతో కాండం, దుబ్బు బలహీనపడడం వల్ల అక్టోబర్​లో కురిసిన వర్షాలకు దోమపోటు ఎక్కువగా ఆశించింది. వానలు, వరదల కారణంగా నేలవాలిన పంటల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది. కాండంపై పెద్దసంఖ్యలో చేరే సుడిదోమ, రసాన్ని పీల్చి పంటను ఎండగొట్టింది. ఏ మడిలో చూసినా గుంపులుగా గుంపులుగా తెల్లబడ్డ వరి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో  చేన్లకు చేన్లనే దెబ్బతీసింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు కనీసం నాలుగు నుంచి ఐదుసార్లు ఇమిదక్లోప్రెడ్,  ఎస్పెట్, తీయమేథోక్సన్-లాంటి మందుల్ని స్ప్రే చేశారు. ఇందుకోసం ఒక్కో ఎకరానికి ఫెస్టిసైడ్స్​పైనే  రూ.5వేల నుంచి రూ.10వేల వరకు అదనంగా ఖర్చు చేసినట్లు రైతులు చెబుతున్నారు.

ఎకరానికి 5 క్వింటాళ్లు లాస్​..

మన రాష్ట్రంలో వరి పంట ఎకరానికి సగటున 20 నుంచి 22 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.  కానీ దోమపోటు కారణంగా ఆవరేజ్​ దిగుబడి ఎకరానికి 15 నుంచి17 క్వింటాళ్లకు పడిపోయిందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు.  ఏలెక్కన చూసినా 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి తగ్గుతుందని, తద్వారా రూ.10వేలు, ఫెస్టిసైడ్స్​కు పెట్టిన రూ.10వేలు కలుపుకుంటే ప్రతి ఎకరాకు రూ.20వేల దాకా లాస్​ అయ్యామని రైతులు అంటున్నారు. ప్రభుత్వం సర్వే చేయించి దోమపోటుతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్​ చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలవారీగా ఎఫెక్ట్​ఇలా..

ఆసిఫాబాద్ జిల్లాలో 55 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, సుమారు 5,500 ఎకరాల్లో పంట దోమపోటుతో దెబ్బతిన్నది. దహేగాం, సిర్పూర్ టి ,కౌటాల మండలాల్లో  సమస్య  తీవ్రంగా ఉంది.  నిర్మల్‍ జిల్లాలో 1.03 లక్షల ఎకరాల్లో వరి వేయగా దాదాపు 20 వేల ఎకరాల్లో పంట దోమపోటు వల్ల దెబ్బ తిన్నట్టు అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెప్తున్నారు.  మామడ, నర్సాపూర్‍, లక్ష్మణచాందా,  సారంగాపూర్‍ మండలాల్లో దోమపోటు ఎఫెక్ట్​ ఎక్కువగా ఉంది.  మంచిర్యాల జిల్లాలో లక్షా 65 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, సుమారు 20 వేల ఎకరాల్లో దోమపోటు వచ్చి, తగ్గుతోంది. ప్రస్తుతం ఆకు మచ్చ తెగులు 25 వేల ఎకరాల్లో ఎఫెక్ట్ చూపిస్తోందని  డీ ఏ ఓ వీరయ్య తెలిపారు.

కరీంనగర్ జిల్లాలో  రెండున్నర లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా, దాదాపు 18 వేల ఎకరాల్లో దోమపోటు వచ్చినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో దాదాపు 2లక్షల ఎకరాల్లో వరి  వేయగా, 5వేల ఎకరాల్లో దోమపోటు వచ్చినట్లు ప్రభుత్వానికి రిపోర్టు పంపారు. పెద్దపల్లి, సుల్తానాబాద్​, ఓదెల, రామగిరి, కమాన్​పూర్​, ధర్మారం మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. జగిత్యాల జిల్లాలో 2,78,000 ఎకరాల్లో వరి సాగుచేయగా, అందులో 20శాతం పంటకు దోమపోటుతో ఎఫెక్ట్​ అయిందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంటున్నారు. కానీ ఇప్పటివరకు తాము ఎన్ని ఎకరాల్లో నష్టం జరిగిందో కరెక్ట్​గా అంచనా వేయలేదని చెప్పారు.

వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలో దోమపోటు ఎక్కువగా సోకింది.  6,554 ఎకరాల్లో వరి సాగు చేయగా అందులో 850 ఎకరాల్లో దోమ ఎఫెక్ట్​ ఉంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో  సుమారు 5 వేల ఎకరాల్లో వరికి దోమపోటు సోకినట్టు అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెప్పారు.  మహబూబాబాద్ జిల్లాలో 1.82 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, తొర్రూరు, గూడూరు, నెల్లికుదురు,  బయ్యారం, ననసింహులపేట మండల్లాల్లో  దోమ పోటు, మసిపేను  ప్రభావం తీవ్రంగా ఉంది. సుమారు 82 వేల ఎకరాలలో దోమపోటు సమస్య ఉన్నట్లు తెలుస్తోంది.

వనపర్తి జిల్లాలో సన్న రకం వరి పైరుకు కోత దశలో ఉండగా అగ్గి తెగులు ఆశించింది. జిల్లా లో ఒక లక్షా 36 వేల ఎకరాలలో వరి వేయగా ఎనిమిది వేల ఎకరాల వరకు పంటల పై తెగులు ప్రభావం పడిందని, పైర్లు మాడి పోయాయని డిస్ట్రిక్ట్​ అగ్రికల్చర్​ ఆఫీసర్​ సుధాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా లోని పెద్దమందడి,పెబ్బేరు,పాన్ గల్, కొత్తకోట మండలాల్లో తెగులు ప్రభావం ఎక్కువగా ఉంది. నారాయణపేట జిల్లాలో మద్దూర్, ఊట్కూరు, మాగనూర్, ధన్వాడ మండలాల్లోని 1,200 ఎకరాల్లో సన్న వరి పంట దోమపోటు వల్ల దెబ్బ తిన్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్  చెప్పారు. నాగర్​కర్నూలు జిల్లాలో 1లక్ష పది వేల ఎకరాల్లో వరి సాగు చేయగా,  25 వేల ఎకరాల్లో పంట దోమపోటు బారిన పడింది. కొల్లాపూర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని డిస్ట్రిక్ట్​ అగ్రికల్చర్​ ఆఫీసర్​ వెంకటేశ్వర్లు తెలిపారు.

మెదక్ జిల్లాలో  1.19 లక్షల ఎకరాల్లో సన్న రకం వరి పంట సాగు చేయగా, సుమారు 80 వేల ఎకరాల్లో దోమపోటు  ఆశించింది. కొల్చారం, మెదక్, వెల్దుర్తి, హవేలీ ఘనపూర్, నా ర్సింగి, నిజాంపేట్, చిన్న శంకరం పేట మండలాల్లో  సమస్య ఎక్కువగా ఉంది. సంగారెడ్డి జిల్లాలో 540ఎకరాల్లో వరికి దోమపోటు బెడద ఉన్నది.  సంగారెడ్డి, పుల్కల్, అందోల్, జోగిపేట, రాయికోడు, మునిపల్లి మండలాల్లో  సమస్య ఎక్కువగా ఉందని జిల్లా వ్యవసాయ అధికారి నర్సింగ్ రావు తెలిపారు.

సిద్దిపేట జిల్లాలో ఈ సీజన్ లో 2.17 లక్ష ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇందులో 70 శాతం సన్న రకాలే. భారీ వర్షాల వల్ల 41 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది.  సుమారు 25వేల ఎకరాల్లో దోమపోటుసోకిందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు.  కోహెడ, బెజ్జంకి, హుస్నాబాద్‌‌, అక్కన్నపేట, నంగునూరు, దుబ్బాక, మిరుదొడ్డి, చిన్నకోడూరు, నంగునూరు రాయపోల్‌‌, దౌల్తాబాద్‌‌ మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ లో 75 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో సుమారు 15 వేల ఎకరాల్లో పంటకు పాము పొడ, కాటుక తెగులు, ఆకు ఎండు తెగులు సోకినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్తున్నారు. సూర్యాపేట జిల్లాలో దోమపోటు, అగ్గితెగులు కారణంగా సుమారు 50వేల ఎకరాలకు పైగా వరి దెబ్బతిన్నట్లు అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంటున్నారు. ముఖ్యంగా మునగాల, నడిగూడెం, మోతే, హుజూర్ నగర్,మఠంపల్లి మండలాలలో ఎఫెక్ట్​ఎక్కువగా ఉంది.

ఖమ్మం జిల్లాలో 8,990 ఎకరాల్లో వరి పంటకు దోమపోటు తదగిలింది. సత్తుపల్లి, పాలేరు నియోజక వర్గాల్లో  సమస్య ఎక్కువ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదివేల ఎకరాలకు  దోమపోటు ముప్పు ఉంది. ఇప్పటికే వెయ్యి ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. అశ్వాపురం, ములకలపల్లి, దమ్మపేట ప్రాంతాల్లో దోమపోటు బెడద ఎక్కువగా ఉంది.

కామారెడ్డి జిల్లాలో 1200 ఎకరాల్లో దోమపోటు సోకినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. కామారెడ్డి, రాజంపేట, దోమకొండ, లింగంపేట, నాగిరెడ్డిపేట, సదాశివనగర్​, ఎల్లారెడ్డిల్లో తెగులు ప్రభావం ఎక్కువగా ఉంది.

అగ్రికల్చర్​ ఆఫీసర్ల అంచనా ప్రకారం జిల్లాల్లో దోమపోటు ఎఫెక్ట్​ ఇలా..

జిల్లా                                 ఎకరాల్లో

ఆసిఫాబాద్                             5,500

నిర్మల్‍                                20 ,000

మంచిర్యాల                          20 ,000

వనపర్తి                                  8,000

నారాయణపేట                         1,200

నాగర్​కర్నూలు                      25,000

మెదక్                                  80,000

సంగారెడ్డి                                   540

సిద్దిపేట                                25,000

నల్గొండ                                15,000

సూర్యాపేట                            25,000

ఖమ్మం                                  8,990

భద్రాద్రి                                    1000

కరీంనగర్                              18,000

పెద్దపల్లి                                  5,000

భూపాలపల్లి, ములుగు             5 ,000

మహబూబాబాద్                    82,000

కామారెడ్డి                                 1200

వరంగల్​రూరల్​            850

తొందరగా గుర్తిస్తే మేలు

ఈ సీజన్ లో వర్షాలు అధికంగా కురవడం వల్ల దోమపోటు వచ్చింది. ఇది ఎక్కువగా సన్న రకాలపై ప్రభావం చూపుతోంది. అయితే ఇది ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కావడం లేదు. ప్రతి పొలానికి వస్తోంది. దీన్ని  వెంటనే గుర్తించి  మందులు పిచికారి చేసుకుంటే  కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాలకు ఇది బాగా పెరిగింది. వర్షాలకు పొలంలో నేలకు వాలిన  చేలల్లో దోమపోటు ప్రభావం ఎక్కువగా ఉంది.

–వాసిరెడ్డి శ్రీధర్, డీఏవో, కరీంనగర్

సిద్దిపేట జిల్లా  కోహెడకు చెందిన పొన్నాల కనకయ్య రెండెకరాల్లో సన్నవడ్లు సాగుచేశాడు.  వరి గొలక దశకు చేరాక దోమపోటు సోకి, వడ్లన్నీ నల్లబడి తాలుగా మారుతున్నాయి. ఎన్ని మందులు కొట్టిన దోమపోటు కంట్రోల్​ కాలేదని కనకయ్య అంటున్నాడు. రెండెకరాలపై ఇప్పటివరకు సుమారు రూ.60 వేల  వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయాయని చెబుతున్నాడు. తమ లాంటి రైతులను పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాడు. 

 

ఈ రైతు పేరు తుమ్మల తిరుపతి. జగిత్యా ల జిల్లా ఆత్మకూరులో 6 ఎకరాల్లో వరిపంట వేశాడు. అక్టోబర్‌లో పడిన వానలకు దోమ పోటు రావడంతో 4 ఎకరాలు పూర్తిగా దెబ్బతిన్నది. పశువులు గడ్డి కూడా మేయవని తెలిసి 4 ఎకరాల చేనుకు నిప్పు పెట్టాడు . 6 ఎకరాల్లో పెట్టుబడికి లక్షన్నర దాకా ఖర్చు చేశానని, అప్పులకు వడ్డీలు మీదపడుతాయని తిరుపతి ఆవేదన చెందుతున్నాడు. పంట బాగా వస్తే పిల్లలను మంచి కాలేజీలో చేర్పిద్దామనుకున్నానని, ఇలా జరుగుతుందని అనుకోలేదని కంటతడి పెడుతున్నాడు.

 

For More News..

సీజన్ దాటినా చేన్లకే పరిమితమైన చెరుకు పంట

వచ్చే నెల 30 వరకు ఇంటర్నేషనల్‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌ బంద్‌‌

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, కానిస్టేబుల్