
- నిరుడు సీఎంఆర్పెండింగ్ పెట్టిన మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టిన ఆఫీసర్లు
- తాజాగా వడ్ల దిగుబడికి సరిపడా లేని మిల్లులు
- ఇంకా సెంటర్లలోనే లక్షల టన్నుల వడ్లు
- అకాల వర్షాల నేపథ్యంలో ఆందోళనలో రైతులు
చిన్నచింతకుంట/ మాగనూరు, వెలుగు: సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులంతా వరి సాగుకే ప్రయారిటీ ఇచ్చారు. దీంతో ఈ యాసంగిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 14.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చాయి. ఇందుకు అనుగుణంగా సెంటర్లు ఓపెన్ చేసినా.. సరిపడా మిల్లులు అందుబాటులో లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
డిఫాల్ట్ లిస్టులో 148 మిల్లులు
గత సీజన్లలో ఉమ్మడి జిల్లాలోని అన్ని రైస్ మిల్లులకు ఆఫీసర్లు సీఎంఆర్‌ను అలాట్ చేశారు. కానీ చాలా మంది మిల్లర్లు అలాట్ చేసిన సీఎంఆర్‌ను తిరిగి సివిల్ సప్లయ్‌కు అప్పగించలేదు. రెండు, మూడేళ్లు కావస్తున్నా వారు స్పందించకపోవడంతో, ఆఫీసర్లు అత్యధికంగా వనపర్తి జిల్లాలో 119 మిల్లులను, నాగర్‌కర్నూల్‌లో 15, గద్వాలలో నాలుగు, నారాయణపేటలో పది మిల్లులను డిఫాల్ట్ మిల్లుల లిస్టులో చేర్చారు. దీంతో గత వానాకాలం సీజన్లో వడ్ల దిగుబడులకు అనుగుణంగా మిల్లులకు కేటాయింపులు చేశారు. ఈ యాసంగిలో సన్నాల సాగు గణనీయంగా పెరగడంతో మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన అలాట్ మెంట్ పూర్తి కావస్తోంది. కొన్ని చోట్ల మిల్లులు ఫుల్ కెపాసిటీకి చేరుకోవడంతో మిల్లర్లు వడ్ల బస్తాలను దింపుకోవడం లేదు.
కోటా పూర్తి కావడంతో కష్టాలు
నారాయణపేట జిల్లాలోని మాగనూరు, కృష్ణ మండలాల్లో ఐదు రైసు మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లులకు ప్రభుత్వం అలాట్ చేసి కోటా వడ్లు పూర్తి అయ్యాయి. దీంతో కోటాకు మించి అదనంగా వస్తున్న వడ్లను మిల్లర్లు దింపుకోవడం లేదు. ఆఫీసర్లు కూడా స్థానికంగా ఉన్న మిల్లుల కోటా పూర్తి కావడంతో సెంటర్లకు వస్తున్న వడ్లను 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోస్గి మండలంలోని మిల్లులకు, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్వాలలోని మిల్లులకు అలాట్ చేస్తున్నారు.
అంత దూరం వడ్ల బస్తాలను తీసుకెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళనకు దిగుతున్నారు. రైతులకు ట్రాక్టర్ల అద్దెలు గుదిబండగా మారాయి. దీన్ని నిరసిస్తూ రెండు రోజుల కిందట మహబూబ్‌నగర్, రాయచూర్ నేషనల్ హైవేపై ధర్నా చేశారు. స్థానికంగా కాకుండా.. ఇతర ప్రాంతాల్లో ఉన్న మిల్లులకు వడ్లను అలాట్ చేస్తే ప్రభుత్వమే లారీలను ఏర్పాటు చేసి తరలించాలని డిమాండ్ చేశారు.
వడ్లను నింపి వారమైంది
నేను వడ్లను సెంటర్‌కు తెచ్చిన మరుసటి రోజు సంచుల్లో నింపా. ఇప్పటికే వారం దాటిపోయింది. ఇంత వరకు లారీలు రావడం లేదు. సాయంత్రం అయితే ఆకాశం మబ్బులు కమ్ముకుంటోంది. ఏ టైంలో వర్షం పడుతుందోనని భయమేస్తోంది. వర్షం పడి సంచుల్లో ఉన్న వడ్లు తడిస్తే.. మొత్తానికి మొత్తం నష్టపోతా. లారీల గురించి ఆఫీసర్లను అడిగితే ఈ రోజు, రేపు అని సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారు.
నక్క రాజు, రైతు, కురుమూర్తి గ్రామం, మహబూబ్‌నగర్ జిల్లా