23 రోజులుగా రైస్​ మిల్లింగ్​ బంద్​

23 రోజులుగా రైస్​ మిల్లింగ్​ బంద్​
  • 23 రోజులుగా రైస్​ మిల్లింగ్​ బంద్​
  • 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ఆపడంతో ఎఫ్సీఐ సీరియస్
  • జూన్ 8 నుండి సీఎంఆర్ సేకరణ నిలిపివేత
  • ఆగిపోయిన 93 లక్షల టన్నుల వడ్ల మిల్లింగ్

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర సర్కారు తీరు వల్ల మిల్లుల్లో రైస్​ మిల్లింగ్​ బందైంది. జూన్ 8 నుంచి మిల్లులకు తాళాలు పడ్డాయి. ఫలితంగా ఎక్కడి వడ్లు అక్కడే పేరుకుపోతున్నాయి. రైతులకు అందాల్సిన వడ్ల పైసలు కూడా అందడం లేదు. గరీబ్​ కల్యాణ్​ యోజన కింద కేంద్ర ప్రభుత్వం అందించే 5 కిలోల ఉచిత బియ్యాన్ని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీనికి తోడు మిల్లింగ్​లో అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోకపోవడమూ మరో కారణం. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎఫ్​సీఐ).. కస్టమ్​ మిల్లింగ్​ రైస్​ (సీఎంఆర్​) సేకరణను నిలిపివేసింది. బియ్యాన్ని ఎఫ్​సీఐ తీసుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,440 రైస్‌‌ మిల్లుల్లో 23 రోజుల నుంచి మిల్లింగ్‌‌ ఆగిపోయింది. చివరికి తప్పు తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. జూన్​ 20 నుంచి ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభించింది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై యాక్షన్‌‌ తీసుకుంటామని కేంద్రానికి తెలిపింది.  

93 లక్షల టన్నుల వడ్ల మిల్లింగ్‌‌  ఆగింది
రాష్ట్ర సర్కారు ఉచిత బియ్యం పంపిణీ చేయని కారణంగా 2,470 రా రైస్ మిల్స్, 970 బాయిల్డ్ రైస్ మిల్స్​లో మిల్లింగ్  ఆగింది. దాదాపు 15 లక్షల టన్నుల వడ్ల లోడ్లు రోడ్లపైనే ఉన్నాయి. ఈ యాసంగిలో సేకరించిన 50.15 లక్షల టన్నుల  వడ్లు, అదేవిధంగా వానాకాలంలో సేకరించిన వడ్లు, నిరుడు యాసంగికి సంబంధించిన వడ్లు అంతా కలిపి 93 లక్షల టన్నుల వరకు మిల్లింగ్‌‌ కాకుండా నిలిచిపోయాయి. మిల్లింగ్​ జరగకపోవడంతో మొత్తంగా 62.28 లక్షల టన్నులకు పైగా బియ్యం ఎఫ్‌‌సీఐ ఆపేసింది. వీటి విలువ రూ. 20 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 

సీఎంఆర్‌‌  నిలిచిపోవడానికి కారణాలివే..!
గరీబ్‌‌ కల్యాణ్‌‌ యోజన కింద రేషన్​ కార్డుదారులకు ఒక్కొక్కరికి కేంద్రం అదనంగా 5 కిలోల బియ్యాన్ని ఈ ఏడాది నవంబర్​ వరకు  ఉచితంగా అందించాలని గతంలో నిర్ణయించింది. ఈ అదనపు కోటా ఉచిత  రేషన్‌‌ బియ్యాన్ని రాష్ట్ర సర్కారు  మే, జూన్‌‌ నెలలో లిఫ్ట్‌‌ చేసింది. కానీ ప్రజలకు పంపిణీ చేయలేదు. సెంట్రల్‌‌ పూల్‌‌ ద్వారా  1.90 లక్షల టన్నులు బియ్యం లిఫ్ట్‌‌ చేసిన రాష్ట్ర సర్కారు లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడాన్ని జూన్​ మొదటి వారంలో గుర్తించిన ఎఫ్​సీఐ.. తీవ్రంగా పరిగణించింది. అదే విధంగా రైస్‌‌ మిల్లుల్లో ఎఫ్‌‌సీఐ నిర్వహించిన  తనిఖీల్లో భారీగా ధాన్యం గాయబ్‌‌ అయినట్లు తేలింది.  మే నెలలో నిర్వహించిన తనిఖీల్లో 63 మిల్లుల్లో 1,37,872 బస్తాల వడ్ల  షార్టేజ్​బయటపడింది. మార్చిలోనూ 4 లక్షల బస్తాల వడ్ల తేడాను ఎఫ్​సీఐ గుర్తించింది.  నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ను ఎఫ్​సీఐ ఆదేశించింది. లబ్ధిదారులకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకపోవడం, మిల్లుల్లో అక్రమాలు వెలుగుచూస్తున్నా చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్రం నుంచి సేకరించాల్సిన కస్టమ్​ మిల్లింగ్​ రైస్​ ను జూన్ 8 నుంచి నిలిపివేసింది. 

రాష్ట్ర సర్కారు దిద్దుబాటు చర్యలు 
కేంద్రం నిర్ణయంతో రాష్ట్ర సర్కారు  దిద్దుబాటు చర్యలకు దిగింది. జూన్ 20 నుంచి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ మొదలుపెట్టింది. ఈ ఏడాది డిసెంబర్ వరకూ పంపిణీ చేస్తామని చెప్పింది. మే నెల ఉచిత బియ్యాన్ని డిసెంబర్​లో  అందించాలని నిర్ణయించింది. ఉచిత రేషన్‌‌ పంపిణీ చేస్తామని, అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని కేంద్రానికి జూన్‌‌ 9న రాష్ట్రం లేఖ రాసింది. రాష్ట్ర సర్కార్​ ఉచిత రేషన్​ను జూన్‌‌ 20 నుంచి పంపిణీ చేస్తున్నదని కేంద్రానికి ఎఫ్‌‌సీఐ సమాచారం అందించింది. ఫిజికల్​ వెరిఫికేషన్​లో నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన 593 మిల్లుల్లో ఇప్పటి వరకు 393 మిల్లుల్లో వెరిఫికేషన్‌‌ పూర్తయిందని,  200 మిల్లుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సమాచారం ఇచ్చినా వెరిఫై చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎఫ్​సీఐ అధికారులు రిపోర్టు చేశారు.  సీఎంఆర్‌‌ సేకరణపై సెంట్రల్‌‌ నుంచి అనుమతి రావాల్సి ఉంది. అప్పటివరకు మిల్లుల్లో మిల్లింగ్​ జరిగే అవకాశం లేదు. 

రూ.2,335.26 కోట్లు బాకీ
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వడ్ల పైసలు అందడం లేదు. రాష్ట్రంలో  9.38 లక్షల మంది రైతులు రూ.9,817.94 కోట్లు విలువైన యాసంగి వడ్లు అమ్ముకోగా అందులో 5.95 లక్షల మంది రైతులకు రూ.7,482.68 కోట్లు చెల్లించింది. ఇంకా 3.43 లక్షల మంది రైతులకు  రూ.2,335.26 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మిల్లుల్లో మిల్లింగ్​ నిలిచిపోవ డంతో వడ్ల పైసలు లేటవుతున్నాయని ఆఫీసర్లు అంటున్నారు.