రిచ్ ఏరియాలు.. పూర్ ఫెసిలిటీస్ !

రిచ్ ఏరియాలు.. పూర్ ఫెసిలిటీస్ !
  • బంజారాహిల్స్, జూబ్లీహిల్స్​లోనూ సమస్యలు 
  • రోడ్లు, వాటర్, డ్రైనేజీ, విద్యుత్ ఇబ్బందులు
  • పరిష్కారం చూపని అధికారులు, సిబ్బంది
  • ఎన్నికలప్పుడు హామీలకే పరిమితం
  • బల్దియా ట్విట్టర్​కు ఆ ప్రాంతాల నుంచే ఎక్కువ ఫిర్యాదులు

హైదరాబాద్, వెలుగు : సిటీలో బస్తీలు, కాలనీల్లోనే కాదు.. రిచ్ ఏరియాల్లోనూ సమస్యలు ఉన్నాయి. వీఐపీలు ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లోనూ మౌలిక వసతులు సరిగా లేవు. రోడ్లు, వాటర్, డ్రైనేజీ, విద్యుత్, పార్కులు తదితర ఇబ్బందులు నెలకొన్నా అధికారులు, సిబ్బంది చూసీచూడనట్లుగానే ఉంటున్నారు. డ్రైనేజీలు పొంగి రోజుల పాటు పారుతున్నా పనులు చేయడం లేదు. రోడ్డుపై ఎత్తులు, గుంతలు ఉండటంతో మురుగంతా ఒకే ప్రాంతంలో చేరడంతో వచ్చే దుర్వాసనను తట్టుకోలేపోతున్నారు.  

విద్యుత్ సమస్య ఉన్నా నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. చెట్ల కొమ్మలు వేలాడుతున్న కూడా వాటిని కట్ చేయడం లేదని, గాలులు వీచే సమయంలో రోడ్లపై విరిగి పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. డైలీ రోడ్లు క్లీన్ చేయడంలేదంటున్నారు. రిచ్ ఏరియాల్లో చాలా వరకు సైలెంట్ వాతావరణం ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో దొంగలు కూడా తిరుగుతుంటారని,   డే అండ్ నైట్ పోలీసు పెట్రోలింగ్ నిర్వహించాలని, గల్లీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రోడ్లు క్లియర్​గా ఉంటుండగా వాహనాలు స్పీడ్​గా వెళ్తున్నాయని, వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు వేయాలని పేర్కొంటున్నారు. ఆయా సమస్యలను పట్టించుకోకపోవడంతో నిత్యం సంపన్నుల ఏరియాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. 

పార్కులను పట్టించుకోవట్లే.. 

పార్కుల్లో కనీసం వాకర్స్ వాక్ చేయడానికి ట్రాక్​లు సరిగా లేవు. పార్కుల ఆవరణలో చెత్త చెదారం పేరుకుపోయిన పట్టించుకునే వారు లేరు. కొన్ని పార్కుల గోడలు కూలి పడినా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సంపన్నుల ఏరియాల్లో ఉంటున్న వారు ఎక్కువగా కేబీఆర్ పార్కుకు వెళ్తుంటారు. కాలనీల్లోని పార్కులు సరిగ్గా మెయింటెన్ చేస్తే వాళ్లు లేరు.  వాటిని బాగు చేస్తే అక్కడే వాకింగ్ చేసుకుంటారు. 

హామీలు ఇచ్చేవారే కానీ..

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా  లీడర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని వారి స్థాయిలో లీడర్లు హామీలు ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత   కనిపించడం లేదని పలువురు చెబుతున్నారు. ఏదైనా సమస్యతో కొందరు స్థానిక లీడర్లను కలుద్దామని ఎంత ప్రయత్నించినా ఏదో ఒక సాకు చెబుతూ దాటవేస్తున్నారని అంటున్నారు. ఎన్నికలు అయ్యాక పనులు మాత్రం చేయడం లేదు.  బల్దియాకు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్​కు వస్తున్న ఫిర్యాదుల్లో సంపన్నులు ఉండే ప్రాంతాల నుంచే ఎక్కువగా ఉంటున్నాయి. తమ ప్రాంతంలో సమస్య ఉందని, వెంటనే పరిష్కరించాలని ట్విట్టర్​ వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు.