
ప్రపంచ వ్యాప్తంగా కాలానుగుణంగా పెట్టుబడి పెట్టాల్సిన అసెట్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. మార్కెట్ సైకిల్, ఆర్థిక రాజకీయ భౌగోళిక అంశాలు ఇందుకు కారణాలుగా ఉంటుంటాయి. అందుకే గ్లోబల్ రిచ్ ఇన్వెస్టర్లు కూడా దీనికి అనుగుణంగానే తమ పెట్టుబడి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంటారు.
దేశంలోని సంపన్న పెట్టుబడిదారులు రానున్న 12 నెలల్లో ప్రయత్నామ్నాయ పెట్టుబడి మార్గాలను అన్వేషించటం.. ఒకటి కంటే ఎక్కువ అసెట్ కేటగిరీల్లో పెట్టుబడులకు ప్లాన్ చేస్తున్నట్లు హెచ్ఎస్బీసీ 2025 నివేదిక అఫ్లుయెంట్ ఇన్వెస్టర్ స్నాప్షాట్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 10వేల 797 మంది పెట్టుబడిదారుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం రిపోర్ట్ సిద్ధం చేయబడింది.
భారతదేశంలోని పెట్టుబడిదారులు ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, గోల్డ్ ప్రస్తుతం పోర్ట్ ఫోలియోలో హోల్డ్ చేస్తున్నట్లు తేలింది. అలాగే రానున్న 12 నెలల కాలంలో కూడా వారు పసిడిపై పెట్టుబడులకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. ప్రధానంగా భారతీయ పెట్టుబడిదారుల్లో గతం కంటే ఎక్కువగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి 8 శాతం నుంచి 15 శాతానికి చేరినట్లు రిపోర్ట్ తేల్చింది. ఇదే ధోరణి ప్రపంచ వ్యాప్తంగా సగం మంది ఇన్వెస్టర్లు వ్యక్తం చేశారని.. బంగారాన్ని ప్రస్తుతం ముఖ్యమైన పెట్టుబడిగా పరిగణిస్తున్నారని రిపోర్ట్ వెల్లడించింది.
►ALSO READ | అమెరికాలో భారీగా పెరిగిన సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు.. కారణం ఇదే..
ఇక యువ ఇన్వెస్టర్లు ప్రధానంగా జెన్ జీ ల పెట్టుబడి తీరుతెన్నులను పరిశీలిస్తే.. ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలకు మెుగ్గుచూపుతున్నట్లు తేలింది. ప్రస్తుతం భారతదేశంలోని పెద్ద పెట్టుబడిదారులు తమ పోర్ట్ ఫోలియో మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ముందుకుసాగుతున్నట్లు హెచ్ఎస్బీసీ పర్సనల్ బ్యాంకింగ్ హెడ్ సందీప్ బాత్రా పేర్కొన్నారు. భారతీయులు తమ డబ్బు భవిష్యత్తు రాబడుల కోసం వారు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. సంపద పెరుగుదలతో పాటు దాని భద్రతకు కూడా ఇండియన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్టడీలో తేలింది.