కర్ణాటకల ఎన్నికల బరిలో సంపన్నులు

కర్ణాటకల ఎన్నికల బరిలో సంపన్నులు

బెంగళూరు: వచ్చే నెలలో కర్నాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి తమ ఆస్తులను ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వారిలో కొందరు.. ఈసారి కూడా నామినేషన్ దాఖలు చేశారు. మరి ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న శ్రీమంతులు వీళ్లే..

డీకే శివకుమార్

కర్నాటక కాంగ్రెస్ చీఫ్‌‌, ఏడుసార్లు ఎమ్మెల్యే డీకే శివకుమార్​ ఈసారి కూడా నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తుల విలువ రూ.1,358 కోట్లుగా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు. దీంతో ఆయన ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రెండో అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. క్రితంసారితో పోలిస్తే ఈసారి ఆయన ఆస్తులు రూ. 500 కోట్లు పెరిగాయి. కనకపుర నియోజకవర్గం నుంచి శివకుమార్‌‌ పోటీ చేస్తున్నారు.

మునిరత్న నాయుడు

కర్నాటక హార్టికల్చర్ మినిస్టర్  మునిరత్న నాయుడు.. రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తనకు  రూ. 293 కోట్ల ఆస్తులు ఉన్నట్లు నామినేషన్ లో తెలిపారు. దీంతో ఆయన ఎన్నికల్లో పాల్గొంటున్న మూడవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. గత ఎన్నికల్లో తెలిపిన వివరాలతో పోలిస్తే ప్రస్తుతం ఆయన ఆస్తులు రూ. 250 కోట్లు పెరిగాయి.

హెచ్‌‌డీ కుమారస్వామి

కర్నాటక మాజీ సీఎం హెచ్‌‌డీ కుమారస్వామి.. తనకున్న మొత్తం ఆస్తులు రూ.181 కోట్లు అని ప్రకటించారు. గత ఎన్నికల్లో ప్రకటించిన ఆస్తుల వివరాలతో పోలిస్తే ప్రస్తుతం ఆయన ఆస్తులు రూ. 14 కోట్లు పెరిగాయి. జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి చెందిన కుమారస్వామి1996 సాధారణ ఎన్నికల్లో కనకపుర స్థానం నుంచి లోక్‌‌సభకు ఎన్నికయ్యారు. 2004లో  రామనగర నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఈసారి చన్నపట్న స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

బీవై.విజయేంద్ర

మాజీ సీఎం యడియూరప్ప కొడుకైన బీవై విజయేంద్ర షికారిపుర స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తన ఆస్తుల విలువ రూ.126.18 కోట్లుగా ప్రకటించారు. బీవై విజయేంద్ర రాజకీయాల్లోకి రాకముందు లాయర్‌‌గా పనిచేశారు. 2020 లో ఆయన బీజేపీ కర్నాటక యూనిట్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. పార్టీ యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు..

చదివింది 9 వరకే.. ఆస్తులు 1609 కోట్లు

దేశంలో అత్యంత రిచ్ పొలిటీషియన్లలో ఒకరిగా పేరున్న కర్నాటక మంత్రి ఎంటీబీ నాగరాజు తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. మొత్తం రూ.1,609 కోట్లున్నట్లు అఫిడవిట్​లో పేర్కొన్నారు. రాష్ట్రంలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బెంగళూరు హోస్కోట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన సోమవారం నామినేషన్ వేశారు. అందులో ఆస్తుల వివరాలు వెల్లడించారు. వ్యవసాయం, వ్యాపారం తన ప్రధాన వృత్తిగా పేర్కొన్న నాగరాజు 9 వ తరగతి వరకే చదువుకున్నారు. భార్య శాంతకుమారి పేరు మీదున్న ఆస్తులతో కలిసి రూ.536 కోట్ల విలువైన చరాస్తులు, 1,073 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.98.36 కోట్ల అప్పులున్నట్లు తెలిపారు.