భారత్‏పై అమెరికా సుంకాలు విధించడం కరెక్టే.. ట్రంప్‎కు జైకొట్టిన జెలెన్ స్కీ

భారత్‏పై అమెరికా సుంకాలు విధించడం కరెక్టే.. ట్రంప్‎కు జైకొట్టిన జెలెన్ స్కీ

కీవ్: భారత్‏పై అమెరికా అదనపు సుంకాలు విధించడాన్ని సమర్ధించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఉక్రెయిన్‎తో యుద్ధం సాగిస్తోన్న రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైనదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని సరైన ఆలోచనగా అభివర్ణించారు జెలెన్ స్కీ. ఏబీసీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు జెలెన్ స్కీ. 

ఉక్రెయిన్‎పై దండయాత్ర చేస్తోన్న రష్యాతో వాణిజ్య ఒప్పందాలు కొనసాగించే దేశాలపై సుంకాలు విధించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సరైన ఆలోచనగా భావిస్తున్నానని అన్నారు జెలెన్ స్కీ. రష్యాతో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలపై ట్రంప్ సెకండరీ టారిఫ్‎లు విధించడానికి బహిరంగ మద్దతు తెలుపుతున్నానని స్పష్టం చేశారు. 

ఇటీవల చైనాలోని టియాంజిన్‎లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్‎పై ట్రంప్ సుంకాలను జెలెన్ స్కీ సమర్ధించడం గమనార్హం. 

ఉక్రెయిన్‎తో దాదాపు మూడేళ్లుగా యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి ఇంధనాన్ని ఇప్పటికీ కొనుగోలు చేస్తున్న యూరోపియన్ దేశాలను జెలెన్స్కీ విమర్శించారు. యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యాతో ఆర్ధిక సంబంధాలు నెరపడం వంటి పద్ధతులు న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా,  ప్రతీకార సుంకాల్లో భాగంగా ఇండియా ఎగుమతులపై అమెరికా 25 శాతం టారిఫ్‎లు విధించిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగానే.. ఉక్రెయిన్‎తో యుద్ధం వేళ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందన్న సాకుతో ఇండియాపై మరో 25 శాతం అదనపు సుంకాలు విధించాడు ట్రంప్. దీంతో ఇండియాపై అమెరికా సుంకాలు మొత్తం 50 శాతానికి చేరుకున్నాయి. మరోవైపు.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును ఇండియా సమర్ధించుకుంటుంది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేసింది భారత్.