నెట్‌‌వర్క్18 గూటీలో రిలయన్స్ మీడియా బిజినెస్

నెట్‌‌వర్క్18 గూటీలో రిలయన్స్ మీడియా బిజినెస్

ముంబైముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన మీడియా, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాల్లో భారీ మార్పులు చేస్తోంది. టెలివిజన్ 18 బ్రాడ్‌‌కాస్ట్, హాత్‌‌వే కేబుల్ అండ్ డాటాకామ్, డెన్ నెట్‌‌వర్స్‌‌ను తన ఫ్లాగ్‌‌షిప్ కంపెనీ నెట్‌‌వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌లో కలిపేస్తోంది. మెర్జర్ అపాయింటెడ్ డేట్ ఈ నెల 1గా నెట్‌‌వర్క్18 బీఎస్‌‌ఈ ఫైలింగ్‌‌లో తెలిపింది. మొత్తం బ్రాడ్‌‌కాస్టింగ్ బిజినెస్‌‌ అంతా నెట్‌‌వర్క్18 కింద ఉండనుంది. కేబుల్, ఐఎస్‌‌పీ బిజినెస్‌‌లను నెట్‌‌వర్క్18కు రెండు సెపరేట్‌‌ హోలీ ఓన్డ్‌‌ సబ్సిడరీలుగా ఉంటాయి.  ఈ మెర్జర్ ప్రక్రియంతా.. షేర్ స్వాప్ ద్వారానే జరుగనుంది. షేర్ స్వాప్ అంటే విలీనమయ్యే సంస్థ షేర్లను, ఇతర కంపెనీల షేర్‌‌‌‌హోల్డర్స్‌‌కు వాటి వాల్యుయేషన్ ప్రకారం ఇస్తారు.

న్యూస్, ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్, ఇంటర్నెట్, ఐఎస్‌‌పీ, కేబుల్ బిజినెస్‌‌ల అన్నింటికీ కలిపి ఒకే మీడియా సంస్థను అందించనున్నట్టు నెట్‌‌వర్క్18 పేర్కొంది. ఈ రీస్ట్రక్చరింగ్‌‌తో జీ గ్రూప్, సన్‌‌టీవీ నెట్‌‌వర్క్, ఎకనామిక్ టైమ్స్ పబ్లిషర్స్ బెన్నెట్ కోల్‌‌మ్యాన్ అండ్ కో లిమిటెడ్(బీసీసీఎల్) వంటి సంస్థలతో నెట్‌‌వర్క్18 పోటీ పడనుంది. ఈ మెర్జర్‌‌‌‌ను సంబంధిత కంపెనీలు సోమవారం బోర్డు మీటింగ్స్ నిర్వహించి ఆమోదించాయని నెట్‌‌వర్క్‌‌18 పేర్కొంది. ఈ మెర్జర్ స్కీమ్‌‌తో తమ కార్పొరేట్ స్ట్రక్చర్‌‌‌‌ను సులభతరం చేసి, లిస్టెడ్ సంస్థలను తగ్గించనున్నామని తెలిపింది. నెట్‌‌వర్క్18 కిందకు వచ్చే ఇంటిగ్రేటెడ్ మీడియా అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రెవెన్యూ రూ.8 వేల కోట్లకు పైగా ఉండనుంది. ఈ రంగంలో ఉన్న అతిపెద్ద లిస్టెడ్ ప్లేయర్స్‌‌లో ఒకటిగా మారనుంది. ఈ కన్సాలిడేషన్‌‌తో నెట్‌‌వర్క్18 అప్పులు లేని కంపెనీగా మారనుందని తెలిపింది. డెన్, హాత్‌‌వే బిజినెస్‌‌ల ద్వారా ఇండియాలో 1.5 కోట్ల మంది హౌస్‌‌ హోల్డ్స్‌‌కు లాస్ట్ మైల్ కనెక్షన్‌‌ను అందించే సంస్థల్లో ఒకటిగా మారనున్నామని కంపెనీ ప్రెస్ రిలీజ్‌‌లో తెలిపింది. విలీన సంస్థ.. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా వైర్‌‌‌‌ లైన్ బ్రాడ్‌‌బ్యాండ్ సబ్‌‌స్క్రయిబర్లకు సేవలందించనుందని పేర్కొంది.

అంబానీ మీడియా బిజినెస్‌‌…

నెట్‌‌వర్క్18లో ఇండిపెండెంట్ మీడియా ట్రస్ట్‌‌కు 75 శాతం వాటా ఉంది. ఈ ట్రస్ట్‌‌ పూర్తిగా ఆర్‌‌‌‌ఐఎల్ ప్రయోజనం కోసమే పనిచేస్తోంది.  ఇప్పటి వరకు టీవీ18లో నెట్‌‌వర్క్18కు 51 శాతం వాటా ఉంది. సోనీ ప్రస్తుతం రిలయన్స్‌‌ గ్రూప్‌‌తో మెర్జ్ అయ్యేందుకు చూస్తోంది. ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ బిజినెస్‌‌లను రిలయన్స్ గ్రూప్‌‌తో మెర్జ్ చేసి దేశంలోనే అతిపెద్ద ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ కంపెనీని క్రియేట్ చేయాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. నెట్‌‌వర్క్18 ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,999.51 కోట్లుగా, టీవీ18 మార్కెట్ క్యాప్‌‌ రూ.4,311.62 కోట్లుగా, హాత్‌‌వే మార్కెట్ క్యాప్ రూ.3,407.45 కోట్లుగా, డెన్‌‌ మార్కెట్ క్యాప్ రూ.2,581.78 కోట్లుగా ఉంది.

ఆర్‌‌‌‌ఐఎల్‌‌ కిందకి… గ్రూప్ సంస్థలు పైకి

ఈ వార్తలతో ఆర్‌‌ఐఎల్ షేర్లు 0.83 శాతం నష్టంలో రూ.1,466.10 వద్ద ముగిశాయి. గ్రూప్ కంపెనీలు హాత్‌‌వే, డెన్ నెట్‌‌వర్క్స్, టీవీ18 బ్రాడ్‌‌కాస్ట్ షేర్లు లాభాలు పొందాయి. నెట్‌‌వర్క్18 సంస్థ 4.89 శాతం లాభపడి రూ.30.05 వద్ద.. హాత్‌‌వే 20 శాతం లాభంతో రూ.23.10 వద్ద, డెన్‌‌ 9.98 శాతం లాభంతో రూ.59.50వద్ద ట్రేడయ్యాయి.టీవీ18 బ్రాడ్‌‌కాస్ట్ 14.71 శాతం పెరిగి రూ.28.85కు చేరుకుంది.

ఎవరికెన్ని షేర్లు….

స్కీమ్ అరేంజ్‌‌మెంట్ ప్రకారం షేర్‌‌‌‌హోల్డర్స్‌‌.. టీవీ18కు చెందిన ప్రతి 100 షేర్లకు, 92 నెట్‌‌వర్క్18 షేర్లు పొందుతారు. హాత్‌‌వేకు చెందిన 100 షేర్లకు 78 నెట్‌‌వర్క్18 షేర్లు… డెన్‌‌కు చెందిన ప్రతి 100 షేర్లకు 191 నెట్‌‌వర్క్18 షేర్లు పొందుతారని కంపెనీ తెలిపింది.  బీడీఓ వాల్యుయేషన్ అడ్వయిజరీ, ఎంఎస్‌‌కేఏ అండ్ అసోసియేట్స్ ఫెయిర్ షేర్ ఎక్స్చేంజ్ రేషియోకు వాల్యుయేషన్ రిపోర్ట్‌‌ ఇస్తాయి. సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యురిటీస్లు షేర్‌‌‌‌ ఎక్స్చేంజ్ రేషియోపై ఫెయిర్‌‌‌‌నెస్ ఒపినియన్ అందిస్తాయి.