హత్యాయత్నం నుంచి బయటపడి సివిల్స్ సాధించిండు

హత్యాయత్నం నుంచి బయటపడి సివిల్స్ సాధించిండు

మీరట్: భారీ కుంభకోణాన్ని బయటపెట్టిండని గూండాలు చంపాలని ప్రయత్నించారు.. వాళ్ల దాడిలో కంటి చూపు, వినికిడిశక్తిని కోల్పోయినా కుంగిపోలేదా ఆ ఆఫీసర్. అక్రమార్కుల పని పట్టాలని మరింత కసితో ముందుకెళ్లారు. సివిల్స్ రాసి చివరి ప్రయత్నంలో 683వ ర్యాంక్ సాధించారు. ఆయనే రింకూ సింగ్ రహీ. ఉత్తరప్రదేశ్ సర్కార్ 2007లో నిర్వహించిన ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్​కు రింకూ సింగ్ ఎంపికయ్యారు. 2008లో ముజఫర్ నగర్ లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్​గా డ్యూటీ చేస్తున్న టైమ్​లో రూ.83 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేయగా, నలుగురికి పదేండ్ల చొప్పున జైలు శిక్ష పడింది. కుంభకోణం బయటపెట్టిన కొద్ది రోజులకే రింకూ సింగ్ పై హత్యాయత్నం జరిగింది. ఆయనపై దుండగులు ఏడు రౌండ్ల కాల్పులు జరిపారు.

సివిల్స్ పాఠాలు చెప్పి... 

కోలుకున్న తర్వాత రింకూ సింగ్ తిరిగి ఉద్యోగంలో చేరారు. రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గా పనిచేశారు. సివిల్స్ అభ్యర్థులకు పాఠాలు చెప్పారు. స్టూడెంట్లు తననూ సివిల్స్ రాయాలని కోరేవారని, వాళ్ల వల్లే తాను సివిల్స్ సాధించానని రింకూ సింగ్ చెప్పారు. తనకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. భవిష్యత్తులో దాడులు జరిగితే తనను తాను రక్షించుకోవడం తెలుసునన్నారు.