UPT20: ఆసియా కప్‌కు ముందు బిగ్ రిలీఫ్.. 48 బంతుల్లోనే 108 రన్స్‌తో దుమ్ములేపిన రింకూ

UPT20: ఆసియా కప్‌కు ముందు బిగ్ రిలీఫ్.. 48 బంతుల్లోనే 108 రన్స్‌తో దుమ్ములేపిన రింకూ

ఆసియా కప్ కు ముందు టీమిండియాకు కలవరపెట్టే వార్త ఏమైనా ఉందంటే అది ఫినిషర్ రింకూ పేలవ ఫామ్. ఓ వైపు అంతర్జాతీయ క్రికెట్ లో పేలవ ఫామ్.. మరోవైపు ఐపీఎల్ లో ఘోరంగా విఫలం కావడంతో ఈ యూపీ బ్యాటర్ పై చాలానే విమర్శలు వచ్చాయి. అయినా రింకూ మీద ఉన్న నమ్మకంతో సెలక్టర్లు మరొక ఛాన్స్ ఇచ్చారు. తాను ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో రింకూ మరోసారి నిరూపించాడు. ఉత్తర ప్రదేశ్ టీ20 లీగ్ లో గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 48 బంతుల్లోనే 108 పరుగులు చేసి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. రింకూ ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. 

168 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి మావెరిక్స్ తొలి 8 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రింకూ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు సహచరులు ఔటవుతున్నా బౌండరీల మోత మోగించాడు. 168 పరుగుల లక్ష్య ఛేదనలో రింకూ ఒక్కడే 108 పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గోరఖ్‌పూర్ లయన్స్ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 167 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో మావెరిక్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

రింకూ సింగ్ చివరి 7 టీ20 మ్యాచ్ లు చూసుకుంటే 13.40 సగటుతో కేవలం 67 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని స్ట్రైక్ రేట్ (101.51) కూడా దారుణంగా ఉంది. సౌతాఫ్రికా టూర్ లో 9.33 సగటుతో 28 పరుగులు మాత్రమే చేశాడు. వరుసగా తుది జట్టులో అవకాశాలిస్తున్నా ఉపయోగించుకోలేకపోయాడు. ఐపీఎల్ ప్రదర్శన చూసుకున్నా దారుణంగా ఉంది. చివరి రెండు సీజన్ లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. 2024లో 18.66 సగటుతో 168 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో 29.42 యావరేజ్ తో కేవలం 206 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆసియా కప్ కు ముందు చేసిన ఈ సెంచరీ ఊరటనిస్తోంది.