
శివ్వంపేట, మనోహరాబాద్, కోహెడ(హుస్నాబాద్), వెలుగు: శివ్వంపేటలో సోమవారం యూరియా టోకెన్ల పంపిణీలో తోపులాట జరిగింది. పలువురు మహిళా రైతులు స్వల్పంగా గాయపడ్డారు. రైతు వేదికలో యూరియా వచ్చిందని తెలిసి మండలంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు వందల సంఖ్యలో తరలిరావడంతో రద్దీ నెలకొంది. యూరియా టోకెన్ల కోసం ఒక్కసారిగా రైతు వేదికలోకి వెళ్లడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. కింద పడిపోయిన మహిళా రైతులకు స్వల్ప గాయాలయ్యాయి. కొంతమంది రైతుల పాస్ పుస్తకాలు, డబ్బులు పడిపోయాయి.
యూరియా కొరతను నిరసిస్తూ రైతులు కొంతసేపు రాస్తారోకో చేశారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు సరైన సమాధానం చెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏవో లావణ్యను నిలదీశారు. ఎస్సై మధుకర్ రెడ్డి తహసీల్దార్ కమలాద్రి ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మనోహరాబాద్‌లో యూరియా కోసం రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు.
దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుభాష్ గౌడ్, తహసీల్దార్ ఆంజనేయులు సిబ్బందితో వచ్చి రైతులకు నచ్చజెప్పి శాంతిపచేశారు. హుస్నాబాద్‌లో ఆగ్రోస్ రైతు సెంటర్ వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా ఒక్క బస్తా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోహెడ పీఏసీఎస్ ఎదుట రైతులు ఉదయం నుంచి పడిగాపులుగాశారు. వర్షం పడుతుండడంతో క్యూ లైన్లో చెప్పులను పెట్టారు. గంటల తరబడి వేచి ఉన్నా చివరికి యూరియా బస్తాలు రాలేదని తెలియడంతో నిరాశతో వెళ్లిపోయారు.