మరోవైపు అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌కు టీమిండియా రెడీ అయ్యింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఇది 50వ టెస్ట్ మ్యాచ్ కావడంతో అందరి దృష్టి అతనిపైనే ఉంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. పంత్‌కు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రెండు రోజుల ట్రెయినింగ్ క్యాంప్‌లో దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. గౌతీ సూచనల మేరకు దూకుడు తగ్గించిన పంత్ ఆచితూచి ఆడుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పంత్ బాధ్యతారాహిత్యంగా షాట్లు ఆడి ఔట్ కావడంపై గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
సీనియర్ ప్లేయర్‌గా బాధ్యతలను తీసుకోవాలని సూచించాడు. నెట్ ప్రాక్టీస్ టైమ్‌లోనూ పంత్ స్పిన్నర్లను ఎదుర్కొంటున్నప్పుడు గంభీర్ వెనకాలే నిలబడి నిశితంగా పరిశీలించాడు. పంత్ కూడా ఎక్కువగా డిఫెన్స్‌కే ప్రాధాన్యమిచ్చాడు. ‘సహజసిద్ధమైన దూకుడును తగ్గించుకోవాలని పంత్‌ను మేనేజ్‌మెంట్ కోరలేదు. కానీ మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకోవాలని మాత్రమే సూచించింది. ఈ జట్టులో కేఎల్ రాహుల్ తర్వాత పంత్ అత్యంత సీనియర్ ప్లేయర్. వైస్ కెప్టెన్సీ పోయినా జట్టులో పంత్‌కు ప్రాధాన్యత తగ్గలేదు. ఎప్పుడూ నవ్వుతూ, జట్టులో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాడు’ అని డస్కెట్ పేర్కొన్నాడు.
