ఐపీఎల్ 19 ప్లే ఆఫ్స్ వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. లక్నో సూపర్ జైయింట్స్ కెప్టెన్సీకి స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ రాజీనామా చేశాడు. ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన నేపథ్యంలో పంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. లక్నో సూపర్ జైయింట్స్ మేనేజ్మేంట్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. తనను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని పంత్ కోరగా.. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తూ తక్షణమే అందుకు అంగీకరించామని తెలిపింది.
ఎల్ఎస్జీ క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ మాట్లాడుతూ.. తనను కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని పంత్ అభ్యర్థించగా.. ప్రాంఛైజీ దానిని గౌరవపూర్వకంగా అంగీకరించిందని తెలిపారు. ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ సులభం కాదని.. కెప్టెన్‌గా రిషబ్ ఎల్ఎస్జీకి అందించిన ప్రతిదానికీ మేము కృతజ్ఞులమని పేర్కొన్నారు. ఇప్పుడు తమ దృష్టి అంతా అత్యుత్తమ ప్రమాణాలను చేరుకోవడానికి జట్టు పునర్నిర్మాణం, పునర్‌వ్యవస్థీకరణపై ఉందని తెలిపారు.
లక్నో సూపర్ జైయింట్స్ రూ.27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ బ్యాటర్, కెప్టెన్‌గా రెండు విభాగాల్లో విఫలమయ్యాడు. పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జైయింట్స్ ఐపీఎల్ 2025, 2026లో అట్టర్ ప్లాఫ్ షో కనబర్చింది. 2026 లీగ్ దశలో 14 మ్యాచులు ఆడిన లక్నో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి.. 10 పరాజయాలు చవిచూసింది. తద్వారా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
ఈ ఏడాది బ్యాటర్‌గా కూడా పంత్ తీవ్రంగా నిరాశపర్చాడు. 14 గేముల్లో కేవలం 312 పరుగులు మాత్రమే చేసి అంచనాల మేర రాణించడంలో విఫలమయ్యాడు. ఈ దారుణ ఫెర్ఫామెన్స్‌కు నైతిక బాధ్యత వహిస్తూ లక్నో కెప్టెన్సీ నుంచి పంత్ పక్కకు తప్పుకున్నారు. కెప్టె్న్సీ నుంచి తప్పుకున్న పంత్ ఎల్ఎస్జీలో ఆటగాడిగా కొనసాగుతాడా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
