న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో 0–2తో వైట్‌వాష్ అవడంపై ఇండియా టెస్టు టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ క్షమాపణ చెప్పాడు. ఈ ఘోర పరాజయం నుంచి కోలుకుని తమ జట్టు బలంగా తిరిగొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మెడ గాయంతో శుభ్‌మన్ గిల్ రెండో టెస్టుకు దూరంగా ఉండటంతో పంత్ స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలిసారి అతని నాయకత్వంలో బరిలోకి దిగిన జట్టు 408 రన్స్ తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
టీమ్‌తో పాటు తన ఆటపై తీవ్ర విమర్శలు వస్తుండగా పంత్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘గత రెండు వారాలుగా మేం బాగా ఆడలేదు. ఒక జట్టుగా, వ్యక్తులుగా మేం ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థాయిలో రాణించి కోట్లాది మంది దేశ ప్రజలను సంతోష పెట్టాలని కోరుకుంటాం. ఈసారి మేం అంచనాలను అందుకోలేకపోయినందుకు సారీ. కానీ, ఈ ఆట సవాళ్లను అధిగమించి జట్టుగా, వ్యక్తులుగా ఎదిగేలా మాకు పాఠాలు నేర్పిస్తుంది. ఈ టీమ్ సత్తా ఏంటో మాకు తెలుసు. ఇప్పుడు మేం మరింత కష్టపడతాం. మా లక్ష్యంపై ఫోకస్ పెట్టి.. జట్టుగా, వ్యక్తులుగా మరింత బలంగా, మెరుగ్గా తిరిగొచ్చేందుకు ప్రయత్నిస్తాం’ అని పంత్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
