Rishi Sunak: రిషి సునాక్​కు పదవీగండం..!

Rishi Sunak: రిషి సునాక్​కు పదవీగండం..!
  • బెస్ట్​ ఫర్​ బ్రిటన్​ ఫోకల్​ డేటా పోలింగ్​లో వెల్లడి
  • ఆయనతో పాటు 15 మంది మంత్రులూ ఔట్​
  • సొంత పార్టీ మద్దతుదారుల నుంచే వ్యతిరేకత
  • బోరిస్​ జాన్సన్​ను మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు

లండన్ ​: బ్రిటన్​ ప్రధాని రుషీ సూనక్​కు పదవీ గండం పొంచి ఉంది. ఆయనతో పాటు కేబినెట్​లోని మరో 15 మంది మంత్రుల పదవులూ ఊష్ట్​ అయ్యే అవకాశాలున్నాయట. 2024లో జరిగే జనరల్​ ఎలక్షన్స్​లో వాళ్లంతా వారి సొంత స్థానాల్లోనే ఓడిపోతారని ‘బెస్ట్​ ఫర్​ బ్రిటన్’​ అనే సంస్థ చేసిన ‘ఫోకల్​ డేటా పోలింగ్’ సర్వేలో తేలింది. సూనక్​తో పాటు డిప్యూటీ ప్రధాని డొమినిక్​ రాబ్​, ఆరోగ్య శాఖ మంత్రి స్టీవ్​ బార్​క్లే, విదేశాంగ శాఖ మంత్రి జేమ్స్​ క్లవర్లీ, రక్షణ మంత్రి బెన్​ వాలేస్​, వాణిజ్య శాఖ మంత్రి గ్రాంట్​ షాప్స్​, కామన్స్​ లీడర్​ పెన్నీ మోర్డాంట్​, పర్యావరణ శాఖ మంత్రి థెరీసా కాఫీ వంటి వాళ్లూ ఓడిపోతారని సర్వే వెల్లడించింది. జెరెమీ హంట్​, భారత సంతతికి చెందిన సువెల్లా బ్రేవర్​మాన్​, మైకేల్​ గోవ్​, నదీమ్​ జవావి, కెమీ బాడినోక్​ మాత్రమే ఎన్నికల్లో నెగ్గుతారని పేర్కొంది. 

ఇన్నాళ్లూ అధికార కన్జర్వేటివ్​ పార్టీకి కంచుకోటలైన 10 స్థానాలు లేబర్​ పార్టీ ఖాతాలో పడే అవకాశముందని వివరించింది. సూనక్​ పదవితో పాటు అధికార పార్టీకీ నష్టం తప్పకపోవచ్చని పేర్కొంది. ప్రస్తుతానికి లేబర్​ పార్టీ 20 పాయింట్లు లీడ్​లోనే ఉందని, అయితే, చపలచిత్తమైన ఓటర్లతో ఎన్నికల టైం నాటికి ఆ లీడ్​ తగ్గే ఆస్కారమూ ఉంటుందని తెలిపింది. తన చరిష్మాను పెంచుకునేందుకు, బ్రిటన్​ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇటీవలే ఐదు హామీలను సూనక్​ ప్రకటించినా.. అవేవీ పెద్దగా ఆయనకు కలిసొచ్చేలా లేవని సర్వే వివరించింది. 

ఇటు సొంత పార్టీలోని మద్దతుదారులే ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించే ఆస్కారమున్నట్టు చెప్తున్నారు. మాజీ ప్రధాని బోరిస్​ జాన్సన్​ను మరోసారి ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చే అవకాశముందంటున్నారు. నిరుడు జులైలో సూనక్​ రాజీనామా చేయడం వల్లే బోరిస్​ జాన్సన్​ ప్రభుత్వం కూలిపోయిందని ఆయన మద్దతుదారులు ఇప్పటికే సూనక్​పై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజా సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది.