
మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కు UK మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్ హాజరయ్యి సర్ ప్రైజ్ చేశారు. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ను తెగ ఎంజాయ్ చేశారు. ఈ ఫైనల్లో తన సపోర్ట్ ఆర్సీబీకి అని తెలిపిన UK మాజీ ప్రధాని.. బెంగళూరు జట్టు విజయం సాధించడంతో సంబరాల్లో మునిగి తేలారు. ముఖ్యంగా స్టేడియంలో రిషి సునక్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒక సామాన్యుడిలా మ్యాచ్ ను పూర్తిగా ఆస్వాదించడం విశేషం.
ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ చివరి బంతిని అర్షదీప్ భువనేశ్వర్ వికెట్ తీశాడు. బంతిని పైకి లేపడంతో బౌండరీ వెళ్తుందని భావించినా అలా జరగలేదు. ఆర్య పట్టిన క్యాచ్ కు భువీ ఔటయ్యాడు. ఈ సమయంలో గ్యాలరీ నుంచి లేచి ఔట్ అని తెలిసిన వెంటనే తీవ్ర నిరాశ చెందారు. ఐదు మ్యాచ్ లో ఆర్సీబీ బౌలింగ్ చేస్తున్నప్పుడు కృనాల్ పాండ్య కీలక దశలో ప్రబ సిమ్రాన్ సింగ్ వికెట్ పడగొట్టాడు. ఈ దశలో కమాన్ ఆర్సీబీ అంటూ గట్టిగా అరిచారు. ఈ విజువల్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఒక క్రికెట్ మ్యాచ్ చూడడానికి ప్రధాని రావడం చాలా అరుదు. కానీ రిషి సునక్ ఒక చిన్న పిల్లాడిలా మ్యాచ్ ఎంజాయ్ చేయడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
మ్యాచ్ సునక్ మాట్లాడుతూ "ఇది అద్భుతమైనది. నేను ఇక్కడకు రావడం ఇదే మొదటిసారి. ప్రేక్షకులు చాలా మంది వచ్చారు. నాకు క్రికెట్ లో ఎప్పుడూ ఇలాంటి అనుభూతి కలగలేదు." అని RCB బ్యాటింగ్ ముగిసిన తర్వాత స్టేడియంలో ఇంటర్వ్యూయర్లతో రిషి సునక్ అన్నారు. విరాట్ కోహ్లీ తన అభిమాన ఆటగాడని.. తద్వారా ఐపీఎల్లో బెంగళూరు తన ఫేవరెట్ టీమ్ అని రిషి సునక్ తెలిపారు. మా అత్త మామలు బెంగుళూరుకు చెందినవారేనని.. అంతేకాకుండా ఆర్సీబీలో ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్ వంటి అనేక మంది ఇంగ్లీష్ ఆటగాళ్ళు ఉన్నారని.. తాను ఆర్సీబీకి మద్దతు ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణమని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. 17 ఏళ్లుగా ఎదురు చూసిన ట్రోఫీ 18వ ప్రయత్నంలో సాధించి తమ కప్ కళను నెరవేర్చుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 7 వికెట్లకు 184 పరుగులకు పరిమితమైంది.