యూకే ప్రధాని రేసులో ముందున్న రిషి సునాక్

యూకే ప్రధాని రేసులో ముందున్న రిషి సునాక్
  • మాజీ పీఎం బోరిస్ కూడా.. 
  • ఇప్పటికే అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన పెన్నీ మోర్డాన్ట్

లండన్: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన కన్జర్వేటివ్ పార్టీ లీడర్ రిషీ శునక్ లీడ్ లో ఉన్నారు. రిషికి వంద మంది ఎంపీల మద్దతు ఉందని ఆయన అనుచరులు చెప్పారు. ప్రధాని పదవికి ఆయన పేరే బలంగా వినిపిస్తోంది. కరీబియన్ పర్యటనలో ఉన్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్.. ప్రధాని పదవికి పోటీచేసేందుకు టూర్ నుంచి తిరిగి రావడంతో రిషికి మద్దతు ఇచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. అయితే ప్రధాని పదవికి పోటీచేస్తున్నట్లు రిషి కానీ, బోరిస్ కానీ ఇంతవరకు ప్రకటించలేదు. పెన్నీ మోర్డాన్ట్ మాత్రమే తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. అయినప్పటికీ రిషికి టోరీ (కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడు లేదా మద్దతుదారు) పార్టీలోని వివిధ వర్గాల నుంచి మద్దతు ఇచ్చేవారి సంఖ్య పెరుగుతోంది.

బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు రిషి ఇంతకుముందు మంచి ప్లాన్ వేశారని, ఇప్పుడు కూడా ఆయన వద్ద మంచి ప్లాన్ ఉందనుకుంటున్నానని మాజీ డిప్యూటీ ప్రధాని డొమినిక్ రాబ్.. బీబీసీకి తెలిపారు. ‘‘మన దేశ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తెచ్చేందుకు, దేశంలోని లక్షల మంది ఉద్యోగులు, వ్యాపారుల్లో నమ్మకం కలిగించేందుకు రిషినే బెస్ట్ క్యాండిడేట్ అనిపిస్తోంది. ఇక ప్రధాని పదవికి పోటీ చేసేందుకు కరీబియన్ టూర్ నుంచి తిరిగివచ్చిన బోరిస్ జాన్సన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించారని బోరిస్ ఎదుర్కొంటున్న ఆరోపణలపై యూకే పార్లమెంటు ఇంకా ఎంక్వయిరీ జరుపుతున్న విషయాన్ని మరువరాదు. అవినీతికి తావు ఇవ్వరాదు” అని రాబ్ పేర్కొన్నారు. ప్రధాని పదవికి పోటీచేసేందుకు తన ఉద్దేశాన్ని బోరిస్ తన మిత్రులకు వెల్లడించారని ఓ వార్తా సంస్థ పేర్కొంది.