సెప్టెంబర్​ 5న కొత్త ప్రధాని ఎంపిక

సెప్టెంబర్​ 5న కొత్త ప్రధాని ఎంపిక

20 మంది ఎంపీల మద్దతు సాధించిన భారత సంతతి ఎంపీ

లండన్: బ్రిటన్​ ప్రధానమంత్రి రేసులో మాజీ చాన్స్​లర్​ రిషి సునక్​ దూసుకెళుతున్నారు. తన నామినేషన్​కు అవసరమైన 20 మంది కన్జర్వేటివ్​ పార్టీ ఎంపీల సపోర్ట్​ను ఆయన సాధించారు. పదవి నుంచి తప్పుకోవాలని బోరిస్ జాన్సన్​ నిర్ణయించుకోవడంతో సెప్టెంబర్​ 5న బ్రిటన్​ కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు.  ప్రధానమంత్రి పదవి కోసం మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. భారత సంతతికి చెందిన 42 ఏండ్ల రిషి సునక్​ యార్క్​షేర్​ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రుషి సునక్​తో పాటు ట్రేడ్​ మినిస్టర్ పెన్నీ మోర్డౌంట్, కొత్త చాన్స్​లర్ నదీమ్ జహావీ, టామ్ టుగెన్​ధాత్ తదితరులు ప్రధాని రేసులో ఉన్నారు. వీరంతా 20 మంది ఎంపీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. భారత సంతతికే చెందిన సుయెల్లా బ్రావెర్​మన్, ఫారిన్ సెక్రెటరీ లిజ్​ ట్రస్, నైజీరియా సంతతికి చెందిన కిమి బడెనోచ్, విదేశాంగ శాఖ మాజీ మంత్రి జెర్మీ హంట్, రవాణా మంత్రి గ్రాంట్​ షాప్స్, ఫారిన్​ ఆఫీస్ మినిస్టర్ రెహ్మాన్ ఛిస్తీ, వైద్య శాఖ మాజీ మంత్రి సాజిద్ జావెద్​ తదితరులు కూడా ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నారు. భారత సంతతికే చెందిన హోం సెక్రెటరీ ప్రీతి పటేల్ తొలుత పోటీకి సిద్ధపడినా.. మంగళవారం తప్పుకున్నారు. 

సెప్టెంబర్​ 5న కొత్త ప్రధాని ఎంపిక
1922 కమిటీ సోమవారం ప్రధానమంత్రి పదవికి సంబంధించిన టైం టేబుల్​ను ప్రకటించింది. సెప్టెంబర్​ 5న ప్రధానిని ఎన్నుకుంటారు. సెప్టెంబర్ 7న పార్లమెంట్​ను ఉద్దేశించి కొత్త ప్రధాని ప్రసంగిస్తారు. షెడ్యూల్​ ప్రకారం తొలి రౌండ్​ ఓటింగ్​ బుధవారం జరగనుంది. ఈ రౌండ్​లో ప్రతి అభ్యర్థి 30 మంది ఎంపీల మద్దతును సాధించాలి. గురువారం జరిగే రెండో బ్యాలెట్​లో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఈ వారం చివరి నాటికి ఇద్దరు అభ్యర్థులకు పోటీ చేరుకోకుంటే వచ్చే వారం కూడా తదుపరి రౌండ్ల ఓటింగ్ జరుగుతుంది. పోటీ ఇద్దరు ఫైనలిస్టుల వరకు రావడానికి జులై 21 వరకు సమయం ఉంది. వీరిద్దరూ పార్టీ మెంబర్​షిప్​ బ్యాలట్​ను ఎదుర్కొంటారు.