ప్రపంచాన్ని ఏలుతున్న భారత సంతతి వ్యక్తులు

ప్రపంచాన్ని ఏలుతున్న భారత సంతతి వ్యక్తులు

బ్రిటన్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖితమైంది. తొలిసారిగా  ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు.  ప్రపంచంలోనే అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్ కు ఓ భారత సంతతి వ్యక్తి ప్రధానమంత్రి కావడం దేశానికి ఎంతో గర్వకారణం. గతంలో బ్రిటీషువారు భారతదేశాన్ని పాలించారు. కానీ ఇప్పుడు ఎన్నిక ద్వారా భారత సంతతి వ్యక్తి అధికారికంగా బ్రిటన్ ప్రధాని అయ్యారు. రిషి సునాక్ కాకుండా ప్రపంచ దేశాల్లో పలువురు భారత సంతతి వ్యక్తులు కూడా ఉన్నత పదవులు చేపట్టి సత్తా చాటుతున్నారు.

కమలా హారిస్

కమలా హారిస్ ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన కమలా అమెరికా చరిత్రలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా నిలిచారు. తమిళనాడు మూలాలు ఉన్న కమలా 2011 నుంచి 2017 వరకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా కూడా పనిచేశారు.

.


ప్రవింద్ జుగ్నాథ్

ప్రవింద్ జుగ్నాథ్ మారిషస్ ప్రధానమంత్రిగా ఉన్నారు. అంతకుముందు ఆయన అనేక పదవులలో పనిచేశారు. వీరి పూర్వికులు ఉత్తరప్రదేశ్కు చెందిన వారు. జుగ్నాథ్ అహిర్స్ హిందూ కుటుంబంలో జన్మించారు. 

ఆంటోనియో కోస్టా

ఆంటోనియో కోస్టా పోర్చుగల్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి పూర్వికులు గోవాకు చెందినవారు. ఆంటోనియో కోస్టా తండ్రి ఆర్నాల్డో డా కోస్టా.. గోవాకు చెందినవారు. గతంలోనూ ఆయన కీలక పదవులు చేపట్టారు. 

పృథ్వీరాజ్ సింగ్ రూపన్

పృథ్వీరాజ్ సింగ్ రూపన్ 2019 నుంచి మారిషస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పలుమార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైన ఆయన.. 2019లో మారిషస్‌ అధ్యక్షుడు అయ్యారు. రూపన్ ఆర్య సమాజ్ హిందూ కుటుంబంలో జన్మించారు. 

మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ

మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ గయానా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఆగస్ట్ 2, 2020న ప్రమాణ స్వీకారం చేశారు. అతను వెస్ట్ కోస్ట్ డెమరారాలోని లియోనోరాలో ముస్లిం, ఇండో-గయానీస్ కుటుంబంలో జన్మించాడు.

చాన్ సంతోఖి

చంద్రికా పర్సాద్ (చాన్ సంతోఖి) 2020 నుంచి సురినామ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అతను 1959లో సురినామ్ జిల్లాలోని లెలీడోర్ప్‌లో ఇండో-సురినామీస్ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతను మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి కూడా.

ఇలా భారత సంతతి వ్యక్తులు విదేశాల్లో కీలక పదవులు చేపడుతూ తమ సత్తా చాటుతున్నారు.