మరికాసేపట్లో తేలనున్న రిషి సునాక్ భవితవ్యం

మరికాసేపట్లో తేలనున్న రిషి సునాక్ భవితవ్యం

లండన్ : లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ప్రధాని పదవికి పోటీ పడుతున్నట్లు భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రకటించారు. అయితే రిషికి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ నుంచి తీవ్ర పోటీ ఎదురతుందని భావించినా ఆయన అనూహ్యంగా బరి నుంచి తప్పుకున్నారు. బ్రిటన్ మాజీ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ సైతం రిషి సునాక్ కు మద్దతివ్వడం విశేషం.

బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టేందుకు 100 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు అవసరం కాగా.. రిషికి 142 మంది మెంబర్లు సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవలే మరోసారి పీఎం రేసులో ఉన్నట్లు ప్రకటించిన ఆయన.. అధికారంలో చేపడితే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ఇదిలా ఉంటే హాలిడే ట్రిప్ నుంచి అర్థాంతరంగా తిరిగొచ్చిన బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీ లీడర్ షిప్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే స్పందించిన రిషి సునాక్ బోరిస్ జాన్సన్ ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. బ్రెగ్జిట్, కోవిడ్ వ్యాక్సినేషన్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తదితర సవాళ్లను అధిగమించిన తీరును కొనియాడారు. ప్రధాని బరి నుంచి తప్పుకున్నా బోరిస్ ప్రజా సంక్షేమం కోసం పని చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

జాన్సన్ బరి నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం పెన్నీ మోర్డాంట్ ఒక్కరే రిషి సునాక్తో పోటీ పడే అవకాశముంది. ప్రస్తుతం 29 మంది ఎంపీల మద్దతున్న పెన్నీ.. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2 గంటలలోపు 100 మంది ఎంపీల మద్దతు కూడగట్టుకోని పక్షంలో రిషి సునాక్ ప్రధాని కానున్నారు.