కాప్ 27సదస్సు నుంచి సడెన్ గా బయటికెళ్లిపోయిన రిషి సునాక్

కాప్ 27సదస్సు నుంచి సడెన్ గా బయటికెళ్లిపోయిన రిషి సునాక్

ఈజిప్టులో జరుగుతున్న వాతావరణ సదస్సు నుంచి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. దీంతో అక్కడున్న సభ్యులంతా గందరగోళానికి గురయ్యారు. సమావేశ గది నుంచి రిషి హడావుడిగా బయటికెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యూకేకు చెందిన కార్బన్‌ బ్రీఫ్‌ అనే మీడియా వెబ్‌సైట్‌ డైరెక్టర్‌ లియో హికమన్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో షేర్‌ చేశారు. కాప్‌-27 సదస్సులో భాగంగా అడవుల పరిరక్షణ భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా.. రిషి సునాక్‌ మధ్యలోనే వెళ్లిపోయారని హికమన్‌ ట్వీట్‌ చేశారు. రిషి సునాక్ వేదికపై కూర్చుని ఉన్న సమయంలో.. ఆయన సిబ్బంది ఒకరు వచ్చి సునాక్‌ చెవిలో ఏదో చెప్పారని, దాని గురించి వారిద్దరూ ఏదో మాట్లాడుకున్నారన్నారు. అప్పటికీ రిషి అలాగే కూర్చుని ఉన్నారన్న ఆయన.. కొద్దిసేపటికి మరో సిబ్బంది వచ్చి రిషిని అక్కడి నుంచి వెళ్లిపోదామని కోరారని హికమన్ మరో ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఇది జరిగిన రెండు నిమిషాలకే రిషి వేదికపై నుంచి దిగి తన సిబ్బందితో కలిసి హడావుడిగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే రిషి చెవిలో సిబ్బంది ఏం చెప్పారు? ఆయన అంత హడావుడిగా ఎందుకు వెళ్లిపోయారు? అన్న విషయాలు మాత్రం తెలియరాలేదు. బ్రిటన్‌ ప్రధాని అర్ధాంతరంగా బయటకు వెళ్లడంతో అక్కడున్న వారంతా ఏం జరిగిందో తెలియక కాస్త ఆందోళనకు గురైనట్టు సమాచారం. గత కొన్ని రోజుల క్రితమే కాప్‌-27 సదస్సు ప్రారంభం కాగా.... ఈ సదస్సుకు రిషి అసలు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారట. అయితే ఈ విషయంపై  పలు విమర్శలు రావడంతో తన నిర్ణయాన్ని మార్చుకుని సమావేశాల్లో పాల్గొని పర్యావరణ మార్పులపై ప్రసంగించినట్టు తెలుస్తోంది.