పాత మంత్రులపై వేటు.. కొత్త టీమ్ ప్రకటించిన రిషి

పాత మంత్రులపై వేటు.. కొత్త టీమ్ ప్రకటించిన రిషి

కింగ్ చార్లెస్ 3తో మీటింగ్ ముగిసిన ఒక గంటలోనే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన పనిని మొదలుపెట్టారు. డిప్యూటీ ప్రధానమంత్రిగా డొమినిక్ రాబ్, ఆర్థిక మంత్రిగా జెరెమీ హంట్ పేర్లను ప్రకటించారు. డొమినిక్ రాబ్ కు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హయాంలోనూ డిప్యూటీ ప్రధానమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక కీలకమైన న్యాయశాఖను కూడా రాబ్ కే రిషి అప్పగించారు. ఇంతకుముందు లిజ్ ట్రస్ మంత్రివర్గంలో పనిచేసిన ఐదుగురికి రాజీనామా చేయాల్సిందిగా రిషి సునాక్  సూచించారు. మంత్రి పదవులను కోల్పోయిన వారి జాబితాలో ఆర్థిక శాఖ మంత్రి క్వాసీ క్వార్టెంగ్, వ్యాపార శాఖ మంత్రి జాకబ్ రీస్ మాగ్, న్యాయశాఖ మంత్రి బ్రాండాన్ లెవీస్, పనులు, పెన్షన్ల శాఖ మంత్రి క్లో స్మిత్, అభివృద్ధి శాఖ మంత్రి విక్కీ ఫోర్డ్ ఉన్నారు.  ప్రధాని రేసులో తనతో పోటీపడిన మహిళా ఎంపీ పెన్నీ మోర్డాంట్ కు మళ్లీ ఆమె పాత పదవి (లీడర్ ఆఫ్ ది హౌజ్ ఆఫ్ కామన్స్)ని రిషి కేటాయించారు.  

స్యుయెల్లా బ్రేవర్మన్ కు హోంశాఖ

మహిళా ఎంపీ స్యుయెల్లా బ్రేవర్మన్ ను మళ్లీ బ్రిటన్ హోం శాఖ మంత్రిగా రిషి నియమించారు. ఇంతకుముందు లిజ్ ట్రస్ మంత్రివర్గంలోనూ ఇదే పదవిని ఆమె నిర్వర్తించారు. ఈమెయిల్ సెక్యూరిటీ రూల్స్ ను ఉల్లంఘించారనే అభియోగాలు రావడంతో వారం క్రితమే ఆ పదవికి స్యుయెల్లా బ్రేవర్మన్ రాజీనామా చేశారు.  రిషి ప్రధాని కావడంతో ఆమె పదవి ఆమెకు మళ్లీ దక్కింది. 

కొత్త మంత్రులు వీరే..

విదేశాంగ, కామన్వెల్త్, డెవలప్మెంట్ వ్యవహారాల శాఖ మంత్రిగా జేమ్స్ క్లెవర్లీ , వ్యాపార, ఇంధన, పారిశ్రామిక వ్యూహాల శాఖ మంత్రిగా గ్రాంట్ షాప్స్, విద్యాశాఖ మంత్రిగా గిలియాన్ కీపాన్, పనులు, పెన్షన్ల శాఖ మంత్రిగా మెల్ స్ట్రైడ్, పర్యావరణ, ఆహార, గ్రామీణ వ్యవహారాల శాఖ మంత్రిగా డాక్టర్ థెరెసే కోఫే, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, చీఫ్  విప్ గా సైమన్ హర్ట్ లను రిషి ఎంపిక చేశారు. రక్షణ శాఖ మంత్రిగా ఉన్న బెన్ వాలేస్ ను అదే పదవిలో కొనసాగించారు.  ఎంపీ నదీం జహావీని మంత్రిగా నియమించారు . కానీ ఆయనకు ఇంకా శాఖను కేటాయించలేదు. 

లిజ్ చేసిన తప్పులను సరిదిద్దుతా

ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడమే తన మొదటి లక్ష్యమని రిషి ఇవాళ తన తొలి ప్రసంగంలో వెల్లడించారు. ‘‘ బ్రిటన్ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తా. వారి శ్రేయస్సు కోసం రాత్రింబవళ్లు శ్రమించి పనిచేస్తా. భవిష్యత్ తరాలు రుణ ఊబిలో ఉండకుండా చేస్త’’ అని ఆయన తెలిపారు.  మాటలతో కాకుండా చేతల ద్వారా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తానన్నారు. లిజ్ ట్రస్ గతంలో ప్రధానిగా చేసిన తప్పులను సరిదిద్దుతానని రిషి తెలిపారు. లిజ్ తనదైన శైలిలో దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి తాపత్రయపడిందే తప్ప.. మరో ఉద్దేశం ఆమెకు లేదని స్పష్టం చేశారు. అయితే ఆమె చేసిన కొన్ని తప్పులను సరిదిద్దేందుకే కన్జర్వేటివ్ పార్టీ తనకు ప్రధానిగా అవకాశం ఇచ్చిందన్నారు.  రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపైనా ప్రభావం చూపుతోందని గుర్తుచేశారు.