రూ.126 కోట్ల డివిడెండ్ ఆర్జించిన రిషి సునాక్ భార్య అక్షత

రూ.126 కోట్ల డివిడెండ్ ఆర్జించిన రిషి సునాక్ భార్య అక్షత

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ భార్య.. ఇన్ఫోసిస్ కంపెనీ ఫౌండర్ నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తి బ్రిటన్ లోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు. ఆమె పేరిట ఉన్న మొత్తం 3.89 కోట్ల ఇన్ఫోసిస్ కంపెనీ షేర్ల విలువ దాదాపు రూ.5,956 కోట్లు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇన్ఫోసిస్ ప్రకటించిన డివిడెండ్ల ద్వారా అక్షతకు దాదాపు రూ.126.61 కోట్ల ఆదాయం లభించింది. 2021,22 ఆర్థిక సంవత్సరానికిగానూ ఒక్కో ఇన్ఫోసిస్ షేరుకు రూ.16 చొప్పున.. ఈ ఆర్థిక సంవత్సరాని(2022,23)కి సంబంధించి మే 31న ఒక్కో షేరుకు రూ.16.50 చొప్పున వాటాదారులకు డివిడెండ్ ను ప్రకటించారు.  ఈ లెక్కన అక్షతకు రెండు డివిడెండ్ల ద్వారా  రూ.126.61 కోట్లు లభించాయి. రిషి సునాక్, అక్షత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. కృష్ణ, అనౌష్క. వీరు లండన్ లోని అత్యంత విలాసవంతమైన కెన్సింగ్టన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. రిషి, అక్షత ఫ్యామిలీ నివసిస్తున్న ఇంటి విలువ రూ.66 కోట్లకు పైనే. వాళ్లకు కెన్సింగ్టన్ లో ఒక ఫ్లాట్, మరో బిల్డింగ్ కూడా ఉంది. 

అక్షతా మూర్తి తన తల్లి సుధామూర్తి సొంతూరు కర్ణాటకలోని హుబ్బల్లిలో 1980 ఏప్రిల్ లో జన్మించారు. అక్షత పాఠశాల విద్య బెంగళూరులో జరిగింది. అనంతరం ఆమె అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లి క్లార్మెంట్ మెక్ కెనా కాలేజ్ లో ఎకానమిక్స్, ఫ్రెంచ్ సబ్జెక్ట్ లలో డ్యూయల్ డిగ్రీ చేశారు.  ఆ తర్వాత లాస్ ఏంజెలెస్ లోని ఫ్యాషన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ లో ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా కోర్సు చేశారు. ఇది పూర్తికాగానే కొంతకాలం పాటు డెలాయిట్, యూనీ లీవర్ కంపెనీలలో పనిచేశారు. అనంతరం ఎంబీఏ చేసేందుకు స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చేరగా.. అక్కడే అక్షతకు రిషి సునాక్ పరిచయమయ్యారు. ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2009లో  రిషి, అక్షత పెళ్లి చేసుకున్నారు.