పైసలుంటేనే పోటీ చేయండి..ఆశావహులకు స్పష్టం చేస్తున్న ప్రధాన పార్టీలు

పైసలుంటేనే పోటీ చేయండి..ఆశావహులకు స్పష్టం చేస్తున్న ప్రధాన పార్టీలు
  • పోటీ తీవ్రతతో పెరగనున్న ఖర్చులు
  • చైర్మన్​ పదవులు ఇస్తామంటే కొంత ఖర్చు పెట్టుకుంటామంటున్న లీడర్లు

మహబూబ్​నగర్, వెలుగు: మున్సిపల్, కార్పొరేషన్​ ఎన్నికల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్న వారిని ఖర్చుల భయం వెంటాడుతోంది. ఒక్కో పార్టీ నుంచి ప్రతి డివిజన్, వార్డులో పో టీకి నలుగురైదుగురు సిద్ధంగా ఉన్నా.. గతంలో కంటే ఈసారి ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో పార్టీలు సైతం ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఎలాంటి ఫండ్​ పార్టీ పరంగా రాదని సంకేతాలు ఇస్తున్నారు. ఎవరి ఖర్చు వారే పెట్టుకోవాలని ఇటీవల రహస్య సమావేశాల్లో స్పష్టం చేశారు. ఖర్చు పెట్టుకునే శక్తి ఉంటేనే బరిలోకి దిగాలని సూచిస్తున్నారు.

గతంలో కంటే పెరగనున్న ఖర్చు..

గతంలో జరిగిన మున్సిపల్​ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో క్యాండిడేట్లకు ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయనే చర్చ జరుగుతోంది. పార్టీల మధ్య పోటీ ఎక్కువగా ఉండడంతో.. క్యాండిడేట్లు పోటాపోటీగా ఖర్చు చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో 12 నుంచి 15 వార్డుల వరకు ఉండగా.. ఒక్కో వార్డులో 1,400 నుంచి 1,800 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మంది ఓటర్లు ఉన్నారు. 

ఈ వార్డుల్లో పోటీ చేయాలనుకునే క్యాండిడేట్ కు​ కనీసం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పాత మున్సిపాలిటీల్లో 20 నుంచి 45 వార్డుల వరకు ఉండగా.. ఈ వార్డుల్లో 1,500 నుంచి 2,5‌‌‌‌00 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది.

 కార్పొరేటర్​గా పోటీ చేయాలనుకునే వారు లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఒక్కో డివిజన్​లో 2,500 నుంచి 3 వేల మంది ఓటర్లకు పైగా ఉండడంతో రూ.40 లక్షలకు పైగా ఖర్చుల భారం పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో పార్టీలు కూడా క్యాండిడేట్లకు ఎన్నికల ఫండ్​ ఇవ్వడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

చైర్మన్​ పీఠం ఆఫర్​ ఇస్తే!

పార్టీల నుంచి ఫండ్​ రాదని తెలిసి పోటీ చేయాలనుకుంటున్న వారు డైలమాలో పడ్డారు. అయితే కొందరు లీడర్లు మాత్రం తమకు చైర్మన్​ పీఠం ఇస్తామని హామీ ఇస్తే పార్టీ నుంచి పోటీ చేసే క్యాండిడేట్ల కోసం ఖర్చు పెట్టుకొని వారిని గెలిపించుకుంటామని ఆయా పార్టీల జిల్లాల బాస్​ల ముందు చెబుతున్నట్లు తెలిసింది. 

కొద్ది రోజుల కింద నారాయణపేట జిల్లాలోని ఓ మున్సిపల్  పీఠాన్ని ఆశిస్తున్న ఒక లీడర్​ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లను గెలిపించుకునేందుకు రూ.కోటికి పైగా ఇచ్చేందుకు సిద్ధమని చెప్పినట్లు సమాచారం. అలాగే మహబూబ్​నగర్​ జిల్లాలోని ఓ మున్సిపల్​ చైర్మన్​ స్థానాన్ని ఆశిస్తున్న లీడర్​ ఒక్కో కౌన్సిలర్​ క్యాండిడేట్ కు ఎన్నికల ఖర్చు కోసం రూ.5 లక్షల చొప్పున ఇస్తానని ప్రకటించినట్లు తెలిసింది. 

పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితేంటి?

ప్రధాన పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న సీనియర్​ లీడర్లు అసంతృప్తితో ఉన్నారు. ఏండ్లుగా పార్టీ కోసం పని చేసిన తమను కాదని, వేరే పార్టీ నుంచి పార్టీలో చేరిన వారికి, గతంలో ఓ పార్టీలో కౌన్సిలర్లుగా పని చేసిన వారికి బీ ఫారాలు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతుండడంతో నిరాశ చెందుతున్నారు. ఎన్నికల ఖర్చులు భరించలేరని చెప్పి టికెట్​ నిరాకరిస్తుండడంతో ఆవేదన చెందుతున్నారు. వీరికి ఓటు బ్యాంక్, ఆయా సామాజిక వర్గాల నుంచి సపోర్ట్​ ఉన్నా.. పోటీకి అవకాశం ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు.