
వెలుగు బిజినెస్ డెస్క్: గ్లోబల్ రెసిషన్ భయాలు పెరగడంతో బంగారం రేట్లు అటు గ్లోబల్గానూ ఇటు లోకల్‌గానూ భారీగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 58 వేల మార్కును దాటేసింది. రాబోయే రోజులలో ఈ రేట్లు మరింత పెరగొచ్చని, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 60 వేలను తాకినా ఆశ్చర్యపోవక్కర్లేదని ఎనలిస్టులు చెబుతున్నారు. ఉక్రెయిన్–రష్యా వార్ నేపథ్యంలో గ్లోబల్‌గా ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగింది. దీంతో చాలా దేశాలు వడ్డీ రేట్లను పెంచడం మొదలెట్టాయి. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుదల జోరును తగ్గిస్తుందని అంచనా వేశారు.
కానీ, అలాంటి సూచనలు కనిపించకపోవడంతో రెసిషన్ తప్పకపోవచ్చని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లలో బంగారం రేట్లు పెరగడం మొదలైంది. పెళ్లిళ్ల సీజన్లో బంగారం రేట్లు పెరుగుతుండటంతో జ్యుయెలరీ కొనుగోళ్లకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో అవి దిగొచ్చేలా చేయడానికి దిగుమతి సుంకాన్ని తగ్గించొచ్చని భావిస్తున్నారు. గోల్డ్‌పై దిగుమతి సుంకం ప్రస్తుతం 15 శాతంగా ఉంది. రాబోయే బడ్జెట్లో దీనిని కిందికి తెస్తారని ఆశిస్తున్నారు.