వాటా తేల్చాకే నదుల అనుసంధానం చేయాలి : వినోద్ కుమార్

వాటా తేల్చాకే నదుల అనుసంధానం చేయాలి : వినోద్ కుమార్
  •  ముందు సమ్మక్క, వార్దా బ్యారేజీలు,  సీతారామ సాగర్ కు పర్మిషన్ ఇవ్వాలి
  • గోదావరి జలాలను తమిళనాడుకు తరలించే కుట్ర
  • ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్​ను వాయిదా వేయాలి

కరీంనగర్, వెలుగు: గోదావరి జలాల్లో వాటా తేల్చాక, పెండింగ్ ప్రాజెక్టులైన సమ్మక్క బ్యారేజీ, వార్దా బ్యారేజీ, సీతారామసాగర్​కు అన్ని పర్మిషన్లు ఇచ్చాకే నదులు అనుసంధానం చేయాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కానీ, అవేమీ జరగకుండా గోదావరి- కావేరి లింకింగ్ గురించి రాష్ట్రానికి కేంద్రం లెటర్ రాయడం సరికాదన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నదుల అనుసంధానం చేస్తే కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలు ఎడారులుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

గంగా నదిని కావేరితో లింక్ చేయాలనే చర్చ చాలా కాలంగా ఉందని, అయితే‌‌‌‌ ఇందుకోసం గంగా నదిని మహానదిలోకి.. మహానదిని గోదావరిలోకి.. గోదావరిని కృష్ణాలోకి..కృష్ణాను కావేరి నదిలోకి లింక్ చేయాల్సి ఉం టుందన్నారు. అయితే, గంగా నుంచి మహానది లింకింగ్ కు ఇప్పటివరకు సర్వేనే మొదలు కాలేదని, అవేమీ జరగకుండా గోదావరి నదిపై ఇచ్చంపల్లి నుంచి -కావేరి లింకింగ్ గురించి లెటర్లు పంపడం సరికాదన్నారు. నదుల అనుసంధానంపై బండి సంజయ్ మాట్లాడాలని డిమాండ్ చేశారు.

 కృష్ణా నదిలో తెలంగాణకు నీటి లభ్యత తక్కువని, తెలంగాణ ప్రాంతానికి  గోదావరి నది ఒక కల్పతరువన్నారు. ఇచ్చంపల్లి దగ్గర పెద్ద  డ్యాం కట్టి నీళ్లను ఇతర రాష్ట్రాలకు తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టుల అనుమతుల కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ అధ్యక్షుడు పొన్నం అనిల్ గౌడ్ పాల్గొన్నారు.