టెస్టుల్లో టీ20 విధ్వంసం: 56 బంతుల్లో సెంచరీ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు

టెస్టుల్లో టీ20 విధ్వంసం: 56 బంతుల్లో సెంచరీ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు

రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ గురించి అందరికీ పరిచయమే. టాలెంట్ ఉన్నా ఐపీఎల్ లో ఒక్క గొప్ప ఇన్నింగ్స్ ఆడలేదనే పేరుంది. ఎన్ని అవకాశాలు వచ్చినా పరాగ్ తన పేలవ ఆట తీరును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఎంతమంది ఈ యంగ్ ప్లేయర్ పై విమర్శలు గుప్పించారు. దీనికి తోడు రియాన్ వ్యక్తిత్వం అతిగా ఉంటుందనే పేరు కూడా ఉంది. పరాగ్ ను 2024 ఐపీఎల్ కు రాజస్థాన్ రాయల్స్ జట్టు రిటైన్ చేసుకోవడంతో అందరూ షాకయ్యారు. అయితే పరాగ్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. 

ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సంచల బ్యాటింగ్ తో మెరిసిన ఈ 22 ఏళ్ళ కుర్రాడు.. తాజాగా రంజీ ట్రోఫీలో ఆ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఛత్తీస్ ఘర్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో పెను విధ్వంసమే సృష్టించాడు. కేవలం 87 బంతుల్లోనే 155 పరుగులు చేసి టెస్టుల్లో టీ20 మజా చూపించాడు. 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న పరాగ్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 12 సిక్సులు ఉండటం విశేషం. ఫాలో ఆన్ లో తమ జట్టును గట్టెక్కించడానికి శాయశక్తులా పోరాడినా తమ జట్టు(అస్సాం) పరాజయం దిశగా పయనిస్తోంది.   

సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నమెంట్‌ లో పరాగ్ 10 ఇన్నింగ్స్ ల్లో 510 పరుగులతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 182 స్ట్రైక్ రేట్‌తో 7 అర్ధ సెంచరీలతో చేసిన ఈ యంగ్ ప్లేయర్ త్వరలోనే భారత జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు.  మరి దేశవాళీ క్రికెట్ లో దుమ్ము లేపుతున్న పరాగ్ అట చూసి రాజస్థాన్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. మొత్తానికి పరాగ్ విధ్వసం ఎప్పుడు ఆగుతుందో చూడాలి.