అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు, ప్రత్యేక హోదా : RJD మేనిఫెస్టో

అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు, ప్రత్యేక హోదా : RJD మేనిఫెస్టో

రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి 20 లక్షల ఉద్యోగాల చొప్పు.. ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు ఆ పార్టీ చీఫ్ తేజస్వీ యాదవ్. 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఆయన.. 24 హామీలతో బీహార్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024 లో మేము 24 హామీలను తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ రోజు తమ 'పరివర్తన్ పత్ర'ను రిలీజ్ చేశాం.. ఇది తమ కమిట్ మెంట్ అని.. అధికారంలోకి వస్తే హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.

ఇండియా కూటమికి ఓటేస్తే దేశవ్యాప్తంగా కోటి మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని  తేజస్వీ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం తమ ప్రధాన శత్రువు నిరుద్యోగమన్నారు. దీని గురించి బీజేపీ వాళ్లు మాట్లాడడంలేదన్నారు. అధికారంలోకి వస్తే.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను మోసం చేసిందని విమర్శించారు.  తాము ఇచ్చిన హామీని నెరవేరుస్తామని.. ఖచ్చితంగా కోటి ఉద్యోగాలు బర్తి చేస్తామని తేజస్వి యాదవ్ అన్నారు.

ఆగస్టు 15 నుంచి యువతకు నిరుద్యోగం నుంచి విముక్తి లభిస్తుందని... తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆగస్టు 15 నుంచి ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ ప్రారంభిస్తామని హామీనిచ్చారాయన. రక్షా బంధన్‌ సందర్భంగా పేద కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లకు ఏటా రూ.లక్ష అందజేస్తామని.. రూ.500కే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపారు. ఓపీఎస్ (పాత పెన్షన్ స్కీం)ను అమలు చేస్తామని, బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. బీహార్‌లో మెరుగైన కనెక్టివిటీ కోసం.. రాష్ట్రంలోని పూర్నియా, భాగల్‌పూర్, ముజాఫర్‌పూర్, గోపాల్‌గంజ్, రక్సాల్‌లలో 5 కొత్త విమానాశ్రయాలను నిర్మించబోతున్నామని తేజస్వి యాదవ్ తెలిపారు.