
ప్రముఖ కన్నడ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు ఎస్ . నారాయణ్ కుటుంబం వరకట్నం వేధింపుల కేసులో చిక్కుకుంది. ఆయన కోడలు పవిత్ర తన భర్త, అత్తమామలు నారాయణ్ , భాగ్యవతిపై బెంగళూరులోని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ లో వర్నకట్న వేధింపుల కేసు పెట్టారు. నారాయణ్ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు కన్నడ సినీ ఇండస్ట్రీలో తీవ్రచర్చనీయాంశమైంది.
పెళ్లయిన కొన్నాళ్లకే..
పవిత్ర తన ఫిర్యాదులో తన భర్తకు కనీసం డిగ్రీ కూడా చేయలేదు. ఏ ఉద్యోగం చేయకపోవడంతో ఆర్థికంగా కుటుంబం భారం అంతా తనపైనే పడిందని పేర్కొంది. 2021లో పెళ్లయిన కొంత కాలం తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారని తెలిపింది. పలుమార్లు డబ్బులు తీసుకురావాలని డిమాండ్ చేశారని చెప్పింది. కారు కొనేందుకు నా దగ్గర నుంచి లక్ష రూపాయలు, మా అమ్మ దగ్గర నుంచి రూ. 75,000 తీసుకున్నారు.
తర్వాత నా అత్తమామలు 'కళా సామ్రాట్ ఫిల్మ్ అకాడమీ' మొదలుపెట్టినప్పుడు కూడా దానికి ఆర్థిక సహాయం చేసేందుకు మా అమ్మ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టాను అని పవిత్ర పేర్కొన్నారు. అకాడమీ మూతపడిన తర్వాత మరింత డబ్బు కోసం ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. మళ్లీ డబ్బు కోసం అడిగితే, రూ. 10 లక్షలు ప్రొఫెషనల్ లోన్ తీసుకున్నాను. వాళ్లు కొంత మొత్తాన్ని నెలవారీ వాయిదాలుగా చెల్లించి, ఆ తర్వాత ఆపేశారు" అని తెలిపారు.
ALSO READ : 'బాహుబలి 2' రికార్డును బద్దలు కొట్టిన మలయాళ చిత్రం 'కొత్తలోక'
శారీరక , మానసిక వేధింపులు..
పవిత్ర తన ఫిర్యాదులో కేవలం ఆర్థిక లావాదేవీల గురించే కాకుండా, శారీరక, మానసిక వేధింపుల గురించి కూడా ప్రస్తావించారు. పెళ్లి సమయంలో తన తండ్రి పవన్‌కు రూ. 1 లక్ష విలువైన బంగారు ఉంగరం ఇచ్చినా, పెళ్లయ్యాక గొడవలు వచ్చినప్పుడు మామ నారాయణ్, అత్త భాగ్యవతి తనను నిందించేవారని ఆమె ఆరోపించారు. నాకు ఏమైనా జరిగితే దానికి అత్తమాములు నారాయణ్, భాగ్యవతి, భర్త పవన్‌లే బాధ్యులు అని ఫిర్యాదులో ప్రస్తావించారు.
పవిత్ర ఫిర్యాదు ఆధారంగా పోలసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో 'చైత్రద ప్రేమాంజలి' (1992), 'అనురాగద అలగళు', ' మేఘా మాళే' 'తవరిన తొట్టిలు', 'సూర్య వంశ', 'సింహాద్రి సింహ దక్ష' వంటి అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించిన నిర్మాతగా ఎస్. నారాయణ్‌కు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇప్పుడు తన కొడలు పవిత్ర పెట్టిన వరకట్న వేధింపుల కేసుతో మసకబారాయి. ఆయనపై వచ్చిన ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది దర్యాప్తు తర్వాతే తెలుస్తుంది. ఈ కేసు ఇప్పుడు కన్నడ సినీ వర్గాల్లో ఒక సంచలన విషయంగా మారింది.